ఇండియాలో ఇంకో 10 ఏళ్లలో యూత్ కనిపించరేమో.. అంతా తాతలు, బామ్మలే !

తాజాగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024’ నివేదిక ఈ కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.;

Update: 2025-04-07 04:58 GMT
ఇండియాలో ఇంకో 10 ఏళ్లలో యూత్ కనిపించరేమో.. అంతా తాతలు, బామ్మలే !

భారతదేశ జనాభా స్వరూపంలో రానున్న కొన్నేళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణిస్తుండగా, వయోవృద్ధుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. తాజాగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024’ నివేదిక ఈ కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలో జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు గత కొన్నేళ్లుగా స్థిరంగా తగ్గుతూ వస్తోంది. 1971లో అత్యధికంగా 2.2%గా నమోదైన ఈ వృద్ధిరేటు, 2036 నాటికి కేవలం 0.58%కి పడిపోతుందని అంచనా వేయడం జరిగింది.

ఈ గణాంకాలు దేశంలో వృద్ధ జనాభా (60 సంవత్సరాలు పైబడిన వారు) భవిష్యత్తులో భారీగా పెరగనుందనే భయాన్ని కలిగిస్తున్నాయి. దీని ఫలితంగా, దేశంలోని ‘ఆధారపడేవారి నిష్పత్తి’లో ఒక కీలకమైన మార్పు సంభవించనుంది. ఇప్పటివరకు యువకులు పెద్దలపై ఆధారపడుతున్న పరిస్థితి ఉండగా, రానున్న రోజుల్లో వృద్ధులు పిన్న వయస్కులపై ఆధారపడే పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. చారిత్రకంగా పరిశీలిస్తే, భారత జనాభా పిరమిడ్ దిగువ భాగంలో విస్తృతంగా ఉండేది, అంటే పిల్లలు, యువత జనాభా ఎక్కువగా ఉండేవారు. అయితే, 2026 - 2036 సంవత్సరాల జనాభా అంచనాల ప్రకారం, ఈ పిరమిడ్ అడుగు భాగం క్రమంగా కుంచించుకుపోనుంది. అదే సమయంలో..పని చేసే వయస్సు గల జనాభా (వర్కింగ్ ఏజ్ గ్రూప్) పెరుగుదల కనిపించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యువ జనాభా తగ్గుముఖం పట్టడం వల్ల వయోధికుల సామాజిక, ఆర్థిక బాధ్యతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు, దేశంలో మహిళా జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం దేశ జనాభాలో మహిళలు 48.5% ఉన్నారు. 2036 నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 48.8%కి చేరుకుంటుందని అంచనా. ఇదే సమయంలో, పురుషుల జనాభా 51.5% నుండి 51.2%కి తగ్గనుంది. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ మహిళల జనాభా పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 1951లో 14.67 కోట్లుగా ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య, 2036 నాటికి 45.67 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, పట్టణ ప్రాంత మహిళల జనాభా ఇదే కాలంలో 2.89 కోట్ల నుండి 28.59 కోట్లకు చేరుకోనుంది. లింగ నిష్పత్తిలో కూడా సానుకూల పురోగతి కనిపిస్తోంది. 2011లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, 2036 నాటికి ఈ సంఖ్య 952కు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది.

మొత్తంగా, ఈ నివేదిక భారత జనాభాలో చోటుచేసుకుంటున్న కీలకమైన మార్పులను స్పష్టం చేస్తోంది. తగ్గుతున్న జనాభా వృద్ధిరేటు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News