తాజా సర్వే రిపోర్టు: బ్యాకప్ లో మనం తోపులం
ఆసక్తికర సర్వే రిపోర్టు ఒకటి వెల్లడైంది. మారిన సాంకేతికత కారణంగా డిజిటల్ డేటా అన్నది కీలకంగా మారింది.;

ఆసక్తికర సర్వే రిపోర్టు ఒకటి వెల్లడైంది. మారిన సాంకేతికత కారణంగా డిజిటల్ డేటా అన్నది కీలకంగా మారింది. నిజానికి ఈ రోజున ప్రపంచం నడుస్తున్నదే డేటా చుట్టూ. ఆ మాటకు వస్తే సైబర్ నేరగాళ్లు సైతం ఈ డేటాతోనే పలువురిని దోచుకుంటున్న దుస్థితి. ఇలాంటి వేళ డేటాను సురక్షితంగా బ్యాకప్ చేసుకొని ఉండటం.. నేరగాళ్లకు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే.. డేటా బ్యాకప్ విషయంలో ప్రపంచంలోనే భారతీయులు ముందున్న విషయం తాజా రిపోర్టులో వెల్లడైంది. డేటా బ్యాకప్ కు సంబంధించి పలు దేశాల్లో వెస్ట్రన్ డిజిటల్ సంస్థ సర్వే నిర్వహించింది.
డేటా బ్యాకప్ చేస్తున్న దేశాల్లో భారత్ మిగిలిన దేశాల కంటే ముందు ఉన్నట్లుగా తేలింది. తాజా రిపోర్టు ప్రకారం అత్యధికంగా 30 శాతం మంది భారతీయులు నిత్యం తమ డేటాను బ్యాకప్ చేసుకుంటున్నారని.. తర్వాతి స్థానాల్లో అమెరికన్లు 27 శాతం.. బ్రిటన్ దేశస్తులు 23 శాతంతో ఉన్నట్లుగా గుర్తించారు. భారతీయుల్లో 77 శాతం మంది డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ స్టోరేజీని వాడుతున్నట్లుగా తమకు చెప్పారని సర్వే రిపోర్టు పేర్కొంది.
మొబైల్ తో సహా డివైజ్ లు పాడైన కారణంగా.. అనుకోకుండా డిలీట్ చేసిన కాణంగా.. సైబర్ దాడుల కారణంగా తమ డేటాను పోగొట్టుకున్నట్లుగా సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 71 శాతం చెప్పినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. డేటా బ్యాకప్ కోసం మూడు పద్దతుల్ని ఫాలో అవుతున్నట్లుగా పేర్కొంది. డేటాకు సంబంధించి మూడు కాపీలను పెట్టుకోవాలని.. రెండింటిని వేర్వేరు డివైజ్ లతో స్టోర్ చేసుకోవటం.. ఒక సాఫ్ట్ కాపీని క్లౌడ్ వంటి స్టోరేజీలో నిల్వ ఉంచుకునే వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్లుగా వెల్లడించింది.