ట్రంప్ కేబినెట్లో కీలక పదవుల్లో ఇండియన్ అమెరికన్స్!
ఇందులో భాగంగా... వివేక్ రామస్వామి, తులసీ గబ్బార్డ్, నిక్కీ హెలీ మొదలైన పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. చాలా సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ఆయన ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా త్వరలో వైట్ హౌస్ లో అధ్యక్ష స్థానంపై కూర్చోనున్న డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో ఇండియన్ అమెరికన్స్ కి కీలక పదవులు దక్కొచ్చని చెబుతున్నారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తొమ్మిది మంది భారతీయ అమెరికన్ లలో ఆరుగురు ప్రతినిధుల సభకు తమ తమ స్థానాలకు క్లెయిం చేసుకున్నారు. మరోపక్క ఈసారి ట్రంప్ కేబినెట్ లో గతంలో కంటే ఎక్కువ మందికి అవకాశం దక్కడంతోపాటు.. పలువురుకి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
వాస్తవానికి 2016లో అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన విజయం సాధించిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్ బాధ్యతలు స్వీకరించినప్పుడు.. ముఖ్యమైన స్థానాల్లో పలువురు భారతీయ అమెరికన్లను నియమించారు. వారిలో... రాజ్ షా, నిక్కీ హేలీ, అజిత్ పాయ్, నియోమీ రావ్, సీమా వర్మ, విశాల్ అమీన్, కృష్ణ ఆర్, నీల్ ఛటర్జీ, మనీషా సింగ్, ఉత్తం ధిల్లాన్ లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ - అమెరికన్ కమ్యునిటీ చారిత్రాత్మకంగా గణనీయమైన రాజకీయ పురోగతిని సాధించింది. గతంలో ట్రంప్ పదవీకాలంలో సుమారు రెండు డజన్ల కంటే ఎక్కువ మంది భారతీయ అమెరికన్లు పలు ముఖ్యమైన స్థానాల్లో నియమించబడ్డారు. ఇప్పుడు ట్రంప్ 2.0 స్టార్ట్ కాబోతోంది.
దీంతో... గతంలో కంటే మరింత ఎక్కువమంది భారతీయ అమెరికన్లకు, గతంలో కంటే కీలకమైన పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... వివేక్ రామస్వామి, తులసీ గబ్బార్డ్, నిక్కీ హెలీ మొదలైన పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో వివేక్ రామస్వామికి అత్యంత కీలక పదవి దక్కే అవకశాం ఉందని అంటున్నారు.
ఇక ఈ ఎన్నికల క్యాంపెయినింగ్ లో తులసీ గబ్బార్డ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో భాగంగా... దాదాపుగా ఆయన ప్రసంగాలన్నీ ఆమె రాశారని చెబుతున్నారు. దీంతో.. ఆమెకు కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక నిక్కీ హేలీ రాజకీయ అనుభవం గురించి ట్రంప్ కు పాజిటివ్ ధృక్పథం ఉందని చెబుతున్నారు.