బంఫర్‌ ఆఫర్‌.. రియాలిటీ షో గెలిస్తే చాలు!

మీకు అంతరిక్ష యాత్ర చేయాలని ఉందా?.. ఎవరికి అంతరిక్ష యాత్ర చేయాలని ఉండదు చెప్పండి.. అయితే అంతరిక్ష యాత్ర అంటే మాటలు కాదు

Update: 2024-08-30 15:30 GMT

మీకు అంతరిక్ష యాత్ర చేయాలని ఉందా?.. ఎవరికి అంతరిక్ష యాత్ర చేయాలని ఉండదు చెప్పండి.. అయితే అంతరిక్ష యాత్ర అంటే మాటలు కాదు.. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్లడానికి మానసిక, శారీరక ఆరోగ్యాలు కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో చాలామంది భారీ ఖర్చును తలుచుకుని తమ ఆశలను చిదిమేసుకుంటారు.

అంతరిక్ష యాత్ర చేయాలనుకునే ఇలాంటివారి కోసమే ఒక బంఫర్‌ ఆఫర్‌ అందుబాటులోకొచ్చింది. బ్లూ ఆరిజన్‌ కంపెనీ త్వరలో న్యూ షెపర్డ్‌ పేరుతో అంతరిక్ష యాత్రను నిర్వహించనుంది. ఇందులో ఒక భారతీయుడు/భారతీయురాలికి అవకాశం కల్పించనుంది. అయితే ఇందుకోసం రియాలిటీ షోను నిర్వహిస్తోంది. ఇందులో విజేతలుగా నిలిస్తే అంతరిక్ష యాత్రకు బ్లూ ఆరిజన్‌ కంపెనీ ఉచితంగా తీసుకెళ్తుంది.

అంతరిక్ష యాత్రలో పాల్గొనే భారతీయుడు/భారతీయురాలిని ఎంపిక చేయడానికి స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ (సెరా)తో టీవీ షో ప్రొడ్యూసర్‌ ‘బనిజయ్‌ ఆసియా’ జత కట్టింది. ఎంపిక చేసిన వారు రియాలిటీ షోలో పాల్గొంటారు. అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు కావాల్సిన మానసిక, శారీరక స్థైర్యం, ధైర్యం ఉన్నాయో లేదో ఈ షో ద్వారా తెలుసుకుంటారు. అలాగే వివిధ సవాళ్లు, సమస్యలను తట్టుకోగలరో, లేదో పరీక్షిస్తారు.

ఆ తర్వాత రియాలిటీ షోలో విజేతగా నిలిచిన వ్యక్తిని.. న్యూ షెపర్డ్‌ మిషన్‌ లో అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తారు. కాగా ఈ యాత్ర 11 నిమిషాలపాటు సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరుగురికి అవకాశం కల్పించారు. ఇందులో మనదేశం నుంచి ఒకరు ఉంటారు.

Tags:    

Similar News