అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఎంత కష్టం.. ఎంత కష్టం..!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అక్కడున్న భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.

Update: 2025-01-31 06:02 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అక్కడున్న భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ చదువు పూర్తి చేసి, వీసా గడువు ముగిసినా తిరిగివెళ్లని భారతీయులు 7,000 మంది ఉన్నారని చెబుతున్నారు. అమెరికాలో మారుమూల గ్రామంలో ఉన్నా.. వారిని వెతికి ఇండియా పంపించేయాలని ప్రయతిస్తున్నారు!

మరోపక్క ప్రధానంగా పార్ట్ టైమ్ జాబ్స్ పై ట్రంప్ కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదనే చెప్పాలి. వాస్తవానికి పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో ట్రంప్ వచ్చిన తర్వాత కొత్తగా పెట్టిన రూల్స్ లేవు కానీ.. ఉన్న రూల్స్ ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తూ, వాటికి శిక్షలు కూడా దారుణంగా ప్లాన్ చేశారు! అంటే... గత ప్రభుత్వంలో ఉన్న లిబర్టీ ఇప్పుడు లేదన్నమాట!

పైగా రూల్స్ అతిక్రమిస్తే దేశ భహిష్కరణ అనే మాట ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంతకాలం కష్టపడి చదువుకుంటూ.. ఇంట్లో వారికి భారం కాకుండా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నవారికి.. ఒక్కసారిగా క్యాంపస్ వెలుపల పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు కనిపిస్తే ఇండియా పంపించేస్తారనే నిబంధనలు వారిని ముప్పుతిప్పలు పెట్టేస్తున్నాయని అంటున్నారు.

వాస్తవానికి ఎఫ్-1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన భారతీయ విద్యార్థులు చాలా మంది కచ్చితంగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలని.. ఖర్చులకు ఇంట్లోవారికి భారం కాకూడదని.. కన్నవారిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనే ఉంటుందని అంటారు. ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అలానే ఆలోచిస్తారని అంటారు.

అయితే... నిబంధనల ప్రకారం అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు రెగ్యులర్ రోజుల్లో వారానికి 20 గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇక సెమిస్టర్లు, వేసవి సెలవుల సమయంలో అయితే వారానికి 40 గంటల వరకూ పనిచేసుకోవచ్చు. ఈ మేరకు నిబంధనలు అనుమతిస్తాయి.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆన్ క్యాంపస్ జాబ్స్ అందరికీ దొరకవు.. పైగా అక్కడొచ్చే ఆదాయం ఏమూలకూ రాదు! ఈ నేపథ్యంలోనే మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట.. సూపర్ మార్కెట్లు, హోటళ్లు, పెట్రోల్ బంకులు మొదలైన చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా పనిచేసే స్థానికులకు గంటకు 20 - 30 డాలర్లు ఇవాల్సి ఉండగా.. మనవాళ్లు మాత్రం గంటకు 10 డాలర్లకే పని చేస్తుంటారు!

దీంతో... చాలా మంది యజమానులు భారతీయ విద్యార్థులకే అవకాశాలు ఇస్తుంటారు. దీనివల్ల అక్కడ మెయింట్ నెన్స్ వెళ్లిపోవడంతోపటు ఫీజులు కూడా చెల్లిస్తూ ఊర్లో ఉన్న పేరెంట్స్ కి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అయితే... ట్రంప్ వచ్చిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే రిటన్ ఫ్లైట్ అని బెదిరిస్తున్నారు.. చేసి చూపిస్తున్నారు.

ఇది భారతీయ విద్యార్థులకు అతిపెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. జాబ్ లేకుండా గడవని స్థితి.. జాబ్ చేస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. దీంతో... తప్పని పక్షంలో తల్లితండ్రులకు ఫోన్స్ వస్తున్నాయని అంటున్నారు. అక్కడ మెయింట్ నెన్స్ కోసం భారత్ లోని తల్లితండ్రులకు కాల్ చేసి, డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు.

వాస్తవానికి ప్రాంతాలను బట్టి అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల నెలవారీ భోజనం, ఇంటి అద్దె, మొదలైన అవసరాల నిమిత్తం నెలకు సుమారు 50 నుంచి 80 వేళ రూపాయలు అవుతుందని చెబుతారు. ఇప్పుడు అంత సొమ్ము ఇంటి నుంచి పంపించడం అంటే అన్ని కుటుంబాలకూ సాధ్యమయ్యే పనికాదనే చెప్పాలి.

మరోపక్క చాలా మంది తల్లితండ్రులు వారికున్న కొద్ది పాటి పొలాలు, భూములు బ్యాంక్ లో షూరిటీ పెట్టి పిల్లలను అమెరికాకు పంపించారు. ఇంతకాలం వారంతా అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ దేశంలోని ఆ అప్పులు కొంచెం కొంచే రెగ్యులర్ గా తీరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు అది ఆగిపోయింది! దీంతో.. ఆ భూమి పరిస్థితి తల్లితండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇలాంటి గాథలు ఇప్పుడు అమెరికాలో తమ పిల్లలను చదివిస్తున్న చాలా మంది తల్లితండ్రుల నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ట్రంప్ కు మోడీకి ఉన్న స్నేహం మేరకు ఏమైనా లిబర్టీ దొరుకుతుందా, ట్రంప్ కాస్త లిబరల్ గా వెళ్లిపోతారా.. లేక, ఇలా భారతీయ విద్యార్థులకు కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News