అఖండ భారత్ రెండుగా చీలిన వేళ !

హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అని ఐక్యంగా ఉంటూ దేశంలో ఎన్నో ఉద్యమాలు నాడు తెల్ల దొరలకు వ్యతిరేకంగా చేశారు.

Update: 2024-08-15 14:27 GMT

ఆగస్టు 15 అంటే అందరికీ దేశానికి స్వాతంత్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు ఉంటుంది. కానీ అప్పటికి ఒక్కటిగా అఖండంగా ఉన్న భారత్ రెండుగా చీలిన సంగతి మాత్రం పెద్దగా తలవరు. ఈ తరం అయితే అసలు పట్టించుకుంటుందో లేదో కూడా తెలియదు. భారత దేశం అంతా ఒక్కటిగా బలంగా ఉంటూ అత్యంత బలమైన బ్రిటిష్ వారితో పోరాడింది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అని ఐక్యంగా ఉంటూ దేశంలో ఎన్నో ఉద్యమాలు నాడు తెల్ల దొరలకు వ్యతిరేకంగా చేశారు.

ఇలా హిందువులు ముస్లిముల ఐక్యత తెల్ల దొరలకు కంటగింపుగా మారింది అని అంటారు. ఇద్దరూ కలిస్తే ఎంతో బలం. దానిని ముక్కలు చేయడానికి 1900 మొదట్లోనే కుట్ర ఆరంభం అయింది. అలా సాగిన ఆ కుట్ర కాస్తా 1947 నాటికి రెండు దేశాలుగా మారే పరిస్థితికి తెచ్చింది. నిజానికి ఇది దేశ భక్తులకు ఏ మాత్రం ఇష్టం లేదు.

దేశమంతా ఒక్కటిగా పోరాడింది. పరాయి పాలన మీద కత్తులు దూసింది.తీరా స్వాతంత్ర్యం వచ్చేసరికి రెండుగా మారడం అంటే అది పూర్తి ఫలితం ఇవ్వదని కూడా అంతా భావించారు. 1942 నుంచి ఈ వివాదం నలుగుతూ వస్తోంది. చివరికి అయిదేళ్ల పాటు సాగినా విభజనవాదులదే పంతం నెగ్గింది. గాంధీ మొదట్లో నన్ను రెండుగా చీల్చి ఆ మీదట దేశాన్ని చీల్చండి అని చాలా భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశారు.

అది అగ్గి రగిల్చింది. గాంధీ అంటే అందరికీ సమ్మతమే. ఆయనకు దేశ విభజన ఇష్టం లేదు. కానీ తరువాత రోజులలో గాంధీ మాటలను సైతం పెడ చెవిన పెడుతూ ఈ విభజనను చేశారు. ఇక చూస్తే 1947 మొదట్లోనే భారత్ కి స్వాతంత్ర్యం రావాలి. అది ఆగస్ట్ 15 దాకా సాగింది అంటే దానికి కారణం కూడా దేశ విభజన వివాదమే. దానికి సాఫీగా పూర్తి చేసే పనిని బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ మౌంట్ బాటన్ అనే అధికారికి అప్పగించారు. అలా ఆయన ఒక బిగ్ టాస్క్ తో 1947 మార్చి నుంచి భారత్ లో బిజీగానే గడిపారు.

మరో వైపు మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్ ని కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వం అయితే దేశం రెండుగా ఉండాలని మొదట్లో కోరినా తరువాత వాస్తవికతను గుర్తించింది అని అంటారు. విభజన అనివార్యం అని భావించారు అని చెబుతారు. కానీ ఈ విభజన తప్పు అని దేశంలోని అత్యధిక శాతం ఆనాడు అభిప్రాయపడ్డారు అన్నది కూడా చరిత్ర పుటలలో ఉంది.

దానికి ఒక్కటే ఉదాహరణ. మత ప్రాతిపదికన పాకిస్తాన్ విడిపోయింది. అయితే అలా విడిపోయినా కూడా భారత్ లోనే తాము ఉంటామని అత్యధిక శాతం ముస్లింలు ఆనాడు ప్రకటించారు. అలా వారు భారత్ తమకు క్షేమకరమైన దేశమని అపుడే చాటారు. అంటే మత ప్రాతిపదికన విభజనలో అర్థం లేదని నాడే రుజువు అయింది. బయటకు ఎన్ని చెప్పుకున్నా అధికారం కోసం రాజ్యాల కోసం జరిగిన విభజన గానే చరిత్ర పుటలలో ఉందని చెప్పాలి.

మరో వైపు ఆగస్ట్ 14న అంటే భారత్ కంటే ఒక్క రోజు ముందు పాకిస్థాన్ తమ దేశాన్ని ఇచ్చేయమని కోరి విడిపోయింది. అలా వారు ముందే స్వాతంత్ర్యం పొందారు. ఆ మరుసటి రోజు భారత్ కి స్వాతంత్రం వచ్చింది. అందుకే ఆనాటి నుంచి వారు ఆగస్ట్ 14ననే పాక్ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటారు

ఇక ఈ విభజన వల్ల భారత్ ఎంతో నష్టపోయింది. పాకిస్తాన్ సైతం ఇబ్బందుల పాలు అయింది. మత ప్రాతిపదికన విడిపోయిన తరువాత అక్కడ ముస్లిముల కంటే భారతీయ ముస్లింలు ఎంతో అభివృద్ధిని సాధించారు. ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత్ ఎంతగానే అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాలను కూడా ఆదుకుంది. అదే పాక్ లో అయితే ఈ రోజుకీ ఆకలి అవిద్య పేదరికం తాండవిస్తూనే ఉంది.

మన పెద్దల కోరిక ఏనాటికి అయినా అఖండ భారతం. మరి అది జరుగుతుందా అంటే ఏమో వేచి చూడాల్సిందే. ఏదీ అసాధ్యం కాదు. అసలు విభజన ఎందుకు జరిగింది అంటే దానికి జవాబు చెప్పడమూ కష్టమే. కాబట్టి ఏ రోజుకు అయినా పాక్ భారత్ బంగ్లా దేశ ఆఫ్ఘనిస్థాన్ సహా అనేక పొరుగు దేశాలతో అఖండ భారత్ సాధించాలన్నది దేశ భక్తుల కోరిక. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News