మరోసారి కెనడాకు గట్టిగా రిటార్ట్ ఇచ్చిన భారత్!
తమ దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు తన మిత్ర దేశాలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలనూ భారత్ పై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.
కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం కెనడా – భారత్ ల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. నిజ్జర్ ను తమ దేశంలో భారత ప్రభుత్వ ఏజెంట్లే హతమార్చారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం కలకలం రేపింది. అంతేకాకుండా ఆయన తమ దేశంలోని భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. తమ దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు తన మిత్ర దేశాలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలనూ భారత్ పై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.
కెనడా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ మన దేశంలో ఆ దేశ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా ఆ దేశానికి వీసాల జారీని నిలిపేసింది. కెనడాలో ఇప్పటికే ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు నిజ్జర్ హత్యకు సంబంధించి తమకెలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కెనడా తీరుపై ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ దశకం నుంచే కెనడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని మండిపడ్డారు. కెనడా ప్రభుత్వ ఉదాసీన తీరుతో తమ దౌత్యవేత్తలు అక్కడ రాయబార కార్యాలయంలోకి కూడా ప్రవేశించలేకపోతున్నారని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దౌత్యవేత్తలకు ఆ దేశంలో రక్షణ లేదని గుర్తు చేశారు. చంపుతామని పబ్లిక్ గానే బెదిరిస్తున్నారని గుర్తు చేశారు. తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కెనడా అనుమతిస్తోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ లో నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు కెనడాలో ఉన్నారని జైశంకర్ గుర్తు చేశారు. వారిని అప్పగించాలని ఎన్నోసార్లు అభ్యర్థించినా కెనడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. భారత వ్యతిరేక శక్తులు.. కెనడాలో తమ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నాయనేది రహస్యమేమీ కాదు అని జైశంకర్ మండిపడ్డారు.
మరోవైపు నిజ్జర్ హత్యతో.. కెనడాతో తలెత్తిన దౌత్య ఉద్రిక్తతలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ముందు ఈ అంశాన్ని అమెరికా లేవనెత్తింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తో జైశంకర్ భేటీ సందర్భంగా చర్చల్లో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతో పాటు.. నిజ్జర్ అంశాన్ని కూడా అమెరికా ప్రస్తావించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న కెనడా సంస్థలకు సహకరించాలని భారత్ ను బ్లింకెన్ కోరినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఈ విషయాన్ని జైశంకర్ కూడా ధ్రువీకరించారు. తాను కూడా తమ దేశ ఆందోళనలను అమెరికాకు తెలిపానని వెల్లడించారు.
నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా బదులిచ్చారు. ఆ ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య అని, దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.
నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ఆరోపిస్తోందని.. ఆ ఆరోపణలకు సంబంధించి కెనడా వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంటే దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. తామేం తలుపులు మూసుకుని కూర్చోలేదని తెలిపారు. కానీ, కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కదా.. అని జైశంకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఇరు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరిపి.. విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాక్ స్వేచ్ఛపై తమకు కెనడా హితబోధలు అక్కర్లేదని జైశంకర్ కుండబద్దలు కొట్టారు. వాక్ స్వాతంత్య్రం గురించి మాకు ఇతరులు నేర్పించాల్సిన అవసరం లేదన్నారు.