సీఎంలపై సర్వేలు.. పొలిటికల్ లుకలుకలు!
ఇదే ఇప్పుడు రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఎందుకంటే.. యోగి పాలనపై ప్రతిపక్షాల సంగతి ఎలా ఉన్నా.. సొంత పార్టీ బీజేపీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులు వీరేనంటూ.. ఇండియా టుడే-సీఓటర్ సర్వే తాజాగా కొంతమంది పేర్లను ప్రస్తావించింది. ఆయా ముఖ్యమంత్రుల పనితీరుపై పెద్దగా విమర్శలు లేకపోయినా.. దీనిలో తొలి ప్రాధాన్యం సంతరించుకున్న ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ముందుగా.. ఈ జాబితాలో ఎవరున్నారో చూద్దాం.. అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా తొలి పేరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కైవసం చేసుకున్నారు.
ఇదే ఇప్పుడు రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఎందుకంటే.. యోగి పాలనపై ప్రతిపక్షాల సంగతి ఎలా ఉన్నా.. సొంత పార్టీ బీజేపీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వచ్చాయి కూడా. ఆయన పాలన ఏకపక్షంగా ఉందని.. డిప్యూటీ సీఎం ఏకంగా..తన పదవికి రాజీనామా చేసి మూడు మాసాలైంది. కీలకమైన ఎన్నికల సమయంలోనే ఆయన రాజీనామా చేయడంతో పెద్ద ప్రభావం కూడా పడింది. 80కి పైగా పార్లమెంటు స్థానాలు ఉన్న యూపీలో ఈ సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 46 స్థానాలకే పరిమితమైపోయింది. గతంలో 72 స్థానాలు తెచ్చుకుంది.
అలాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన బాగుందని చెప్పడం వెనుక.. రాజకీయాలు ఉన్నాయనేది జాతీయ మీడియా చెబుతున్న మాట. ఇక, ఇతర ముఖ్యమంత్రుల విషయానికి వస్తే.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ) ఉన్నారు. ఈయన పేరు తప్పక ప్రస్తావించాల్సి వచ్చిందనేది కూడా ఒక టాక్. లేకపోతే.. ఢిల్లీలో బీజేపీ పెత్తనం వల్లే.. తమ ముఖ్యమంత్రి వెనుకబడ్డారనే ప్రచారం జరిగి.. అది మోడీ మెడకు చుట్టుకునే ప్రభావం ఉంటుంది.
ఇక, మూడో స్థానంలో ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ నిలిచారు. నాలుగో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి.. స్టాలిన్ ఉన్నారు. ఇలా.. తొలి ఐదుగురు విభిన్న రాజకీయ నేపథ్యాలు ఉన్న వారిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే.. చంద్రబాబును ఎంపిక చేయడం కొత్తకాదు. గతంలోనూ ఆయన వరుసగా తొలి మూడు స్థానాల్లోనే ఉన్నారు. ఇప్పుడు రెండు మాసాలకే ఆయన నాలుగో స్థానంలో నిలిచారు.