నారాయణ మూర్తి 5 నెలల మనవడు జాక్ పాట్ కొట్టాడు!

ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలలో అద్భుతంగా రాణించింది.

Update: 2024-04-19 13:30 GMT

ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలలో అద్భుతంగా రాణించింది. ఈ ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం ఏకీకృత ప్రతిపాదికన రూ.7969 కోట్లుగా ఉంది. అంటే... గత ఏడాదితో పోలిస్తే 30% పైగా అధిక లాభాలను ఇన్ఫోసిస్ గడిచిందన్నమాట. ఈ క్రమంలో... నారాయణమూర్తి మనవడు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అవును... ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి ఐదు నెలల మనవడు ఏకగ్రహ్‌ రోహన్‌ మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన రోహన్.. ఇప్పుడు మరో రూ.4 కోట్లకు పైగా ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ వార్షిక డివిడెండ్ ప్రకటించడమే ఇందుకు కారణం.

ఈ వివరాల ప్రకారం... 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. వీటితో పాటు రూ.20 తుది డివిడెండ్‌, మరో రూ.8 ప్రత్యేక డివిడెండ్‌ లను ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు రూ.28 చొప్పున డివిడెండ్‌ గా చెల్లించాలని నిర్ణయించిందన్నమాట. ఈ నేపథ్యంలో... నారాయణమూర్తి మనవడైన రోహన్‌ కూడా డివిడెండ్‌ రూపంలో రూ.4.2 కోట్లు అందుకోనున్నాడు.

కాగా... ఇన్ఫోసిస్‌ లో 0.40 శాతం వాటాకు సమానమైన 1.51 కోట్ల కంపెనీ షేర్లు నారాయణమూర్తికి ఉన్న సంగతి తెలిసిందే. అయితే... వాటిలో 15 లక్షల షేర్లను ఏకగ్రహ్‌ కు.. నారాయణమూర్తి గత నెల బహుమానంగా ఇచ్చారు. అప్పట్లో దీని విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని అనేచారు! దీంతో భారత్‌ లో అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్ల జాబితాలో ఏకగ్రహ్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా డివిడెండ్‌ రూపంలో మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు.

Tags:    

Similar News