గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ కు వచ్చిన అంతర్జాతీయ ప్రముఖులు

ఈ ఇద్దరు అంతర్జాతీయ ప్రముఖులు ఒకే కార్యక్రమానికి హాజరు కావటం ఆసక్తికరం కాక మరేంటి?

Update: 2024-12-25 05:33 GMT

సత్య నాదెళ్ల పేరు విన్నంతనే తెలియని వారు ఉండరు. మైక్రెసాఫ్ట్ సీఈవోగా వ్యవహరించే ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా.. ఆయనకు ఎంతటి గ్రాండ్ వెల్ కం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరొకరు శంతను నారాయణ్. ఆయన పేరు సైతం సుపరిచితమే అయినప్పటికీ.. కొందరికి మాత్రం అడోబ్ సీఈవో అన్నంతనే టక్కున గుర్తు పట్టేస్తారు. మరి.. ఈ ఇద్దరు అంతర్జాతీయ ప్రముఖులు ఒకే కార్యక్రమానికి హాజరు కావటం ఆసక్తికరం కాక మరేంటి?


అవును.. ఈ ఇద్దరు దిగ్గజ టెక్ ప్రముఖులు తాజాగా హైదరాబాద్ కు రావటమే కాదు.. తాము చదువుకున్న స్కూల్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఇద్దరి ప్రముఖుల హైదరాబాద్ విజిట్ పై పెద్దగా వివరాలు బయటకు రాలేదు. చాలా తక్కువ మందికి తెలిసేలా సాగిన వీరి హైదరాబాద్ విజిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) లో చదివారు. తాజాగా ఈ విద్యా సంస్థ 101 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది.

ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులుగా వీరిద్దరు.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధం గురించి సత్య నాదెళ్ల షేర్ చేసుకున్నారు. ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరిన రోజును ఇప్పటికి మర్చిపోలేను. బస్కెక్కి స్కూల్ కు రావటం.. స్నేహితులను కలవటం లాంటి తీపిగుర్తులు ఎన్నో ఉన్నాయి. నా మీద నాకు ఆత్మవిశ్వాసం కలిపించింది ఈ స్కూలే. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఈ స్కూల్లో చేరా. మా నాన్నకు తరచూ బదిలీలు జరిగేవి. దీంతో వేర్వేరు ఊళ్లలో ఉంటూ ఉండేవాళ్లం. హైదరాబాద్ లోనే కాస్త స్థిరంగా ఉన్నాం. నా పదో తరగతి తర్వాత మా నాన్నకు మళ్లీ ట్రాన్స్ ఫర్ అయ్యింది. తనతో రావాలని చెప్పారు. కానీ.. నేను మాత్రం పట్టుపట్టి హాస్టల్లో ఉండి చదువుకున్నా’’ అంటూ నాటి తీపిగురుతుల్ని గుర్తు చేసుకున్నారు.

అడోబ్ సీఈవో శంతను నారాయణ్ మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివే సమయంలో చాలా ఏళ్లు క్రీడా వార్తల్ని చదివానని.. టెన్నిస్ .. డిబేట్.. లీడర్ షిప్ టీంలలో ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ స్కూల్ కు సత్య నాదెళ్ల చేసిన సేవ స్ఫూర్తిదాయకమన్న శంతను మాటలు పలువురికి కొత్త స్ఫూర్తిని నింపాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖులు ఇద్దరు నగరానికి రావటం.. వీరి రాక గురించి ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోవటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News