వెంకన్న సన్నిధిలో అరుదైన కలయిక.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు, ఓ గవర్నర్!

అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఓ రాష్ట్ర గవర్నర్ హాజరుకావడం విశేషంగా చెబుతున్నారు.

Update: 2025-02-17 07:58 GMT

తిరుపతిలో ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక సదస్సు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో (ఐటీసీఎక్స్) పేరిట జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందూ ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఓ రాష్ట్ర గవర్నర్ హాజరుకావడం విశేషంగా చెబుతున్నారు.

తిరుపతిలో సోమవారం నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోలో ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితోపాటు కేరళ గవర్నర్ రాజేందర అర్లేకర్ కూడా వేదిక పంచుకోనున్నారు.

అంతర్జాతీయ స్థాయి సమావేశం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబుతోపాటు పక్క రాష్ట్రాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరుకానుండటంతో భారీ భద్రత కల్పిస్తోంది. ముగ్గురు నేతల్లో చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారు కాగా, మిగిలిన ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులే కావడం గమనార్హం. హిందూ మత పరిరక్షణతోపాటు దేవాలయాల పవిత్రతను కాపాడటం, ఆలయాల నిర్వహణకు వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు చేయడం డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలపై చర్చించనున్నారు.

తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 15 వేల ఆలయాల ప్రతినిధులు హాజరుకానున్నారని చెబుతున్నారు. సోమవారం నుంచి మూడు రోజులు పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

Tags:    

Similar News