ఐపీవోలో అలాట్ అయితే చాలు.. మెజార్టీ అలానే చేస్తున్నారట

కరోనా పుణ్యమా అని స్టాక్ మార్కెట్ మీద అభిరుచి.. ఆసక్తి ఎక్కువ అయ్యాయి.

Update: 2024-09-03 13:30 GMT

కరోనా పుణ్యమా అని స్టాక్ మార్కెట్ మీద అభిరుచి.. ఆసక్తి ఎక్కువ అయ్యాయి. ఇందులో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. భారీ ఎత్తున లావాదేవీలకు కారణమవుతోంది. ఇదిలా ఉంటే.. పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీలు కేటాయించే షేర్ల కోసం పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గతం కంటే ఎక్కువైంది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీవోలకు సంబంధించిన ఒక అధ్యయనం బయటకు వచ్చింది. ఇందులో ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.

ఐపీవో ద్వారా కంపెనీలు కేటాయించిన షేర్లలో అత్యధికులు.. కంపెనీలు తమకు షేర్లను అలాట్ చేసిన వారం వ్యవధిలోనే అమ్మేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు. .2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబరు మధ్య ఐపీవో కోసం అప్లై చేసుకున్న డి మ్యాట్ ఖాతాల్లో సగం వరకు కొవిడ్ సమయంలోనే ప్రారంభం చేసినవి కావటం గమనార్హం.

ఇక.. దాదాపు 54 శాతం షేర్లను స్టాక్ ఎక్స్చైంజ్ లో నమోదైన వారంలోనే మదుపర్లు అమ్మేస్తున్న విషయాన్ని సెబీ గుర్తించింది. దీనికి యాంకర్ ఇన్వెస్టర్లు మినహాయింపుగా చెప్పాలి. ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్న మదపర్లు లాభాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. వారం లోపు ఐపీవో లో అలాట్ అయిన షేర్లపై 20 శాతానికి మించిన లాభాన్ని పొందినట్లుగా గుర్తించారు. అదే సమయంలో షేరు జారీ ధర కంటే ట్రేడింగ్ లో విలువ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం 23.3 శాతం షేర్లను మాత్రమే అమ్ముకోవటం కనిపిస్తోందన్న విషయాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది.

2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబరు మధ్య జరిగిన 144 పబ్లిక్ ఇష్యూలు మొత్తం రూ.2.13 లక్షల కోట్ల నిధులను సమీకరించగా.. మొత్తం ఇష్యూ పరిమాణంలో 65 శాతం వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మేయటాన్ని గుర్తించారు. మదుపరులు తమకు అలాట్ అయిన షేర్ల విలువలో 50.2 శాతాన్ని నమోదైన వారంలోనే అమ్మేస్తున్నారు. అదే ఎన్ ఐఐలు 63.3 శాతం.. చిన్న మదుపరులు 42.7 శాతం షేర్లు అలాట్ అయిన వారంలోపే అమ్మేస్తున్నారు.

ఐపీవోల కేటాయింపులు ప్రాంతాల వారీగా చూస్తే.. గుజరాత్ లో 39.3 శాతం, మహారాష్ట్రలో 13.5 శాతం.. రాజస్థాన్ 10.5 శాతం కేటాయింపులు జరిగినట్లుగా గుర్తించారు. మ్యూచువల్ ఫండ్ లు తమకు కేటాయించిన షేర్లలో 3.3 శాతం షేర్లను వారంలో అమ్మేస్తుంటే.. బ్యాంకులు 79.8 శాతం షేర్లను అమ్మేస్తున్నట్లుగా గుర్తించారు.

Tags:    

Similar News