ఐ పాక్ పారిపోయే...వాట్ నెక్స్ట్ ?

వైసీపీని గత రెండు ఎన్నికల్లో కాపాడిన ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఈసారి లేకనే 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. ఇపుడు మొదటి అడుగుతో ప్రారంభించాలి.

Update: 2024-06-20 03:00 GMT

ఐ ప్యాక్ అన్న దానితో వైసీపీ అనుబంధం ఈనాటిది కాదు. వైసీపీ పార్టీ పుట్టింది ఎమోషన్స్ తో. వైఎస్సార్ మరణానంతరం తట్టుకోలేని వారు అంతా ఎంతో మంది చనిపోయారు. ఆ తరువాత చాలా మంది జనాలు ఆ కుటుంబం వైపు ఆశగా చూశారు. అపుడు వారికి వైఎస్ జగన్ ఒక ఆశాకిరణంగా కనిపించారు.

అలా ఎమోషన్స్ సెంటిమెంట్స్ మిక్స్ చేస్తే పుట్టిన పార్టీ వైసీపీ. వైసీపీ సంస్థాగతంగా సరైన పునాది లేకుండానే ఘన విజయాలు సాధించింది అంటే అవి ఎమోషన్స్ ప్లస్ సెంటిమెంట్స్ తోనే అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 2014లో ఆ రెండు ఎలిమెంట్స్ గట్టిగా పనిచేయడం వల్లనే వైసీపీ 67 ఎంపీ సీట్లు సాధించింది.

ఇక వైసీపీని సంస్థాగతంగా పటిష్టం చేయకుండా అధినాయకత్వం ఉదాశీనంగా వ్యవహరించింది. 2014 తరువాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ పొలిటికల్ కన్సల్టెంట్ ని తెచ్చుకుంది. అలా వచ్చిన వారే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. అలాగే ఆయన ఏర్పాటు చేసిన సంస్థ ఐ పాక్ టీం. ఈ విధంగా ఐ పాక్ టీం సేవలతో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అని చెప్పవచ్చు.

కానీ దాని కంటే ఎక్కువగా వైసీపీ పట్ల జనంలో ఉన్న సానుభూతి, సెంటిమెంట్, జగన్ కి ఒక్కసారి చాన్స్ ఇవ్వాలన్న ఆలోచన. అప్పటికి అయిదేళ్ల టీడీపీ పాలన పట్ల వ్యతిరేకత అన్నీ కలసి 151 సీట్లతో వైసీపీకి బంపర్ విక్టరీని నమోదు చేశాయి.

అయితే ఈ క్రెడిట్ అంతా తమదేనని వైసీపీ అధినాయకత్వం భావించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోకుండా మరిన్ని కొత్త పోకడలకు పోయింది. నిజానికి 1983లో టీడీపీ ఒక ఆవేశంతో అధికారంలోకి వచ్చింది.కానీ ఆ తరువాత కాలంలో పార్టీని క్యాడర్ బేస్డ్ గా తయారు చేసి దానిని సంస్థాగతంగా పటిష్టంగా చేసుకున్నారు.

టీడీపీ వచ్చాకనే కార్యకర్తలకు శిక్షణా తరగతులు వంటివి నిర్వహించడం రాజకీయంగా ఒక ఒరవడి గా మారింది. అదే విధంగా చూస్తే చంద్రబాబు టీడీపీని సంస్థాగతంగా బాగా బలోపేతం చేసారు. అందుకే ఈ రోజుకీ టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంటుంది.

కానీ వైసీపీ తనకు లభించిన సువర్ణ అవకాశాన్ని జారవిడచుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీని పటిష్టం చేసుకోకుండా వాలంటీర్లను నమ్ముకుంది. వారితోనే అన్నీ అన్నట్లుగా వ్యవహరించింది. దాంతో పార్టీకి ప్రాణం పెట్టిన క్యాడర్ దూరం అయింది. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అంటే అది అధికార బలం తప్ప మరోటి కాదు.

అలా కొత్త ప్రయోగలు చేస్తూ పొలిటికల్ కన్సలెంటెంట్లను నమ్ముకుంటూ వాలంటీర్లను ఒక వ్యవస్థగా మార్చాలని చూసి వైసీపీ బొక్క బోర్లా పడింది. 2019 తరువాత వైసీపీకి పీకే దూరం అయ్యారు. ఆయన శిష్యులు ఐ పాక్ ని రన్ చేస్తూ వైసీపీకి సేవలు అందించారు. అయితే వారి సత్తా ఏమిటో తాజా ఎన్నికల్లో తేలిపోయింది.

వారు వైసీపీని మభ్యపెట్టారా లేక వైసీపీ వారి ప్రభావంలో చిక్కుకుందా అన్నది తెలియదు కానీ ఐ పాక్ మాత్రం నిండా ముంచేసింది. అలా వాలంటీర్లు ఐ ప్యాక్ ని నమ్మి వైసీపీ తన పార్టీని పటిష్టం చేసుకోక ఇపుడు పూర్తిగా ఇబ్బందులు పడుతోంది. ఐ పాక్ పాకప్ చెప్పేసి వెళ్ళిపోయింది అని అంటున్నారు.

అవును వారు సర్వీస్ ప్రోవైడర్స్ లాంటి వారు. అగ్రిమెంట్ అయిపోయినా లేక తమ సత్తా తేలిపోయినా వారు వెళ్ళిపోతారు. సరిగ్గా ఇపుడే వైసీపీకి అసలైన సమస్య వచ్చిపడింది. పార్టీ పెట్టి పుష్కర కాలం అయింది అయినా గ్రౌండ్ లెవెల్ లో పార్టీ వీక్ గా ఉంది. సరైన క్యాడర్ లేదు. సంస్థాగతంగా డొల్లతనం వెక్కిరిస్తోంది.

చూస్తే చేతిలో అధికారం లేదు. వైసీపీని గత రెండు ఎన్నికల్లో కాపాడిన ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఈసారి లేకనే 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. ఇపుడు మొదటి అడుగుతో ప్రారంభించాలి. క్యాడర్ ని దగ్గరకు తీసి పార్టీని పటిష్టం చేయడం చాలా కష్టసాధ్యమైన విషయం. అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయలేదన్న సంగతి తెలిసిన వారు దూరంగా ఉంటారు.

కొత్త వారు వచ్చే చాన్స్ ఉందా అన్నది డౌట్. మొత్తానికి వైసీపీకి అగ్ని పరీక్ష మొదలైంది. అయిదేళ్ళ పాటు పార్టీని కాపాడుకుంటేనే 2029 ఎన్నికలకు రెడీ అవుతుంది. మరి ప్రయోగాలను నమ్ముకుని పార్టీకి గాలికి వదిలిన ఫలితం వైసీపీకి ఇపుడే తెలిసి వస్తోంది అంటున్నారు. వాట్ నెక్స్ట్ అంటే జవాబు ఏమిటో చూడాల్సిందే.

Tags:    

Similar News