ఇజ్రాయెల్-హమాస్ విషయంలో 'ఐసీసీ' ఎంట్రీ.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఇందులో భాగంగా... వారిపై అరెస్ట్ వారెంట్ ఒక్కటే సరిపోదని, వారికి కచ్చితంగా మరణశిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క ఉక్రెయిన్ - రష్యా వార్ అవిరామంగా కొనసాగుతుండగా.. అందులోకి ప్రత్యక్షంగా ఉత్తర కొరియా, పరోక్షంగా చైనా ఎంటరయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క ఇజ్రాయెల్ -హమాస్ మధ్య వార్ క్లైమాక్స్ కి చేరి, ఇరాన్ కి విస్తరించిన పరిస్థితి.
ఇలాంటి పరిణామాలతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొందని అంటున్నారు. మరోపక్క మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు అలుముకున్నాయని ఒకరంటే.. ఇప్పటికే థర్డ్ వరల్డ్ వార్ ప్రారంభమైందని మరొకరు చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఐసీసీ ఎంట్రీతో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్ర సంచలనంగా మారగా, గాజాలో మనిషి మనుగడ అతంత దయనీయంగా మారిందనే కామెంట్లు వినిపిస్తోన్న వేళ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్ లపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఇందులో భాగంగా... వారిపై అరెస్ట్ వారెంట్ ఒక్కటే సరిపోదని, వారికి కచ్చితంగా మరణశిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం నివాస సముదాయాలు, ఆసుపత్రులు, కమ్యునిటీలపై బాంబింగ్ చేస్తున్నారని.. దానిని విజయం అని ఎవరూ అనుకోరని అన్నారు.
వారిపై ఐసీసీ కేవలం అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కాదు.. అది సరిపోదు.. నెతన్యాహు, గ్యాలెంట్ లకు కచ్చితంగా మరణశిక్ష విధించాలి అని అలీ ఖమేనీ పేర్కొన్నారు. మరోపక్క ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం తీవ్రంగా వ్యతిరేకించింది. తాము నెతన్యాహు పక్షాన ఉంటామని వైట్ హౌస్ ప్రకటించింది.
ఇదే సమయంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ వారెంట్ ను అమలు చేసేది లేదని తేల్చి చెప్పాయి. ఇదే సమయంలో తాము ఐసీసీ వారెంట్ ను తిరస్కరిస్తున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఆ న్యాయస్థానానికి ఈ నోటీసులు, వారెంట్లు జారీ చేసే హక్కు లేదని తెలిపింది.