ఏ క్షణమైనా దాడి.. మరో భీకర యుద్ధం అంచున ప్రపంచం?

పశ్చిమాసియా (అమెరికాకు మిడిల్ ఈస్ట్) అంటేనే పెద్ద ఉద్రిక్త ప్రాంతం.

Update: 2024-04-12 06:13 GMT

రెండేళ్లు దాటింది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై.. ఆరు నెలలవుతోంది.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరాటం మొదలై.. సిరియాలో సంక్షోభం అలాగే ఉంది.. పాకిస్థాన్- ఇరాన్ మధ్యన వివాదం జరుగుతోంది.. ఇలాంటి సమయంలో మరో యుద్ధం ముంగిట ప్రపంచం నిలిచింది. ఏ క్షణమైనా నిప్పు రాజుకునే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే గనుక ప్రపంచం పెద్ద ముప్పులో పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత వారం రాజుకున్న నిప్పు..

పశ్చిమాసియా (అమెరికాకు మిడిల్ ఈస్ట్) అంటేనే పెద్ద ఉద్రిక్త ప్రాంతం. చుట్టూ ముస్లిం దేశాలు.. మధ్యలో ఇజ్రాయెల్. దీంతో ఏ చిన్న సంఘర్షణ అయినా పెద్ద వివాదానికి దారితీస్తుంటుంది. గత ఏడాది అక్టోబరు 7న ఇలానే ఇజ్రాయెల్ పై దాడికి దిగింది పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్ర సంస్థ. 200 మందిపైగా ఇజ్రాయెల్, విదేశీ పౌరులను అపహరించింది. అంతేగాక వందల మందిని హతమార్చింది. అప్పటినుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు మొదలుపెట్టింది. ఈ సమరంలో 30 వేలమందిపైగా గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, సిరియా డమాస్కస్‌ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గత వారం దాడి జరిగింది. ఇది ఇజ్రాయెల్ చేసిందేనని ఆరోపణ. ఈ ఘనలోఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటినుంచి ఇరాన్‌ పగతో రగిలిపోతోంది.

దాడి తప్పదు..

ఇరాన్ అణ్వస్త్ర దేశం. అమెరికాకు ఆగర్భ శత్రువు. ఇజ్రాయెల్ అంటేనే తోక తొక్కిన తాచులా లేస్తుంది. అలాంటి ఇరాన్ తమ రాయబార కార్యాలయంపై దాడి చేస్తే ఊరుకుంటుందా? అందుకే ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘ఇజ్రాయెల్‌ ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ’ గురువారం ఇరాన్‌ ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ ఎన్‌ఏ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. దాడి ఎలాగన్నదే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

నేరుగా కాకున్నా..

ఇరాన్ నేరుగా కాకున్నా.. లెబనాన్, సిరియాలోని తమ మద్దతుదారులైన హెజ్బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పై దాడికి దిగే చాన్సుందని తెలుస్తోంది. అయితే, ఇజ్రాయెల్ కు సహజ మిత్రుడైన అమెరికా ఎప్పటిలాగే ఆ దేశానికి అండగా నిలుస్తుంది. అందుకే అమెరికాకూ ఇరాన్ హెచ్చరికలు పంపిది. ఇజ్రాయెల్ కు గను మీరు అండగా నిలిస్తే మిడిల్ ఈస్ట్ లోని మీ స్థావరాలపై దాడి చేస్తామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ను అమెరికా అలర్ట్ చేసింది. ఆ దేశ సెంట్రల్‌ కమాండ్‌ కు చెందిన జనరల్‌ మైకెల్‌ ఎరిక్‌ కొరిల్లా ఇజ్రాయెల్ వచ్చి భద్రతను సమీక్షించారు. అయితే, ఆయుధపరంగా బలమైన ఇజ్రాయెల్‌ కూడా ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామని ప్రకటించింది. ఇరాన్‌ కవ్వింపులకు ఎదురుదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. మరోవైపు తాము ఇజ్రాయెల్‌ వైపే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ, భద్రత విషయంలో రాజీ లేదన్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సైతం ఇరాన్‌ బెదిరింపులను తప్పుబట్టారు. అమెరికన్లు, ఇజ్రాయెల్‌ వైపు ఉంటామని పేర్కొన్నారు.

విమాన సర్వీసులు బంద్..

ఇరాన్ బెదిరింపులు.. అమెరికా అప్రమత్తత.. ఇజ్రాయెల్ దూకుడు నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సర్వీసులను నిలిపివేస్తున్నాయి. లుఫ్తాన్సా ఇదే నిర్ణయం తీసుకుంది. సర్వీసులను కొనసాగిస్తూనే.. ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సమయాలను మార్చింది. పశ్చిమాసియా వెళ్లొద్దంటూతమ పౌరులను రష్యా హెచ్చరించింది.

Tags:    

Similar News