టీడీపీలోకి ఆదిమూలం? బాబు అంతా మరచిపోతారా?

కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్య నేత, మాజీ మంత్రి ఆదిమూలం సురేశ్ వైసీపీ అధినేత జగన్ కు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2025-01-30 02:56 GMT

వైసీపీలో మరో కీలక వికెట్ పడుతోందా? పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామా నుంచి ఇంకా తేరుకోని ఆ పార్టీకి అంతే స్థాయిలో షాక్ తగలబోతోందా? అంటే ఔను అనే సమాధానమే వినిపిస్తోంది. కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్య నేత, మాజీ మంత్రి ఆదిమూలం సురేశ్ వైసీపీ అధినేత జగన్ కు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో కొండపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆదిమూలం తొలిసారిగా ఓడిపోయారు. తనను ఎర్రగొండపాలెం నుంచి కొండపి మార్చడం వల్లే ఓడిపోయాననే ఆవేదనతో ఉన్న ఆయన అకారణంగా స్థానం మార్చారని పార్టీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంతోనే వైసీపీని వీడి టీడీపీలో చేరాలను నిర్ణయించుకున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న తన సామాజిక వర్గం నేతలతో ఈ విషయమై చర్చిస్తున్నారని, వారు ఆదిమూలం పార్టీలో చేరికపై అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారని సమాచారం.

2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలం సురేశ్ తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరఫున సంతనూతలపాడు, 2019లో అదేపార్టీ తరఫున ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనను మంత్రిగా కొనసాగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని సైతం పక్కన పెట్టారు. పార్టీలో ఎంతో గౌరవం, విలువ ఇచ్చిన అలాంటి నేత ఇప్పుడు ఝలక్ ఇవ్వాలని చూడటం వైసీపీ కార్యకర్తలను షాక్ కు గురిచేస్తోంది.

2009కి ముందు రైల్వేలో అఖిలభారత స్థాయి అధికారిగా పనిచేసిన ఆదిమూలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎర్రగొండపాలెంలో బలమైన పునాదులు వేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో తనను అకారణంగా సీటు మార్చారని ఆయన ఆవేదన చెందుతున్నారు. తన సీటు మార్చకపోతే తప్పకుండా విజయం సాధించేవాడనని చెబుతున్నారు. ఎర్రగొండపాలెంలో ఇప్పటివరకు టీడీపీ గెలిచిన చరిత్ర లేదు. గత ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేనే గెలుపొందారు. అలాంటి సీటు నుంచి తనను తప్పించడాన్ని మాజీ మంత్రి సురేశ్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఏడు నెలలుగా ఇదే విషయమై తాను అసమ్మతి వ్యక్తం చేస్తున్నా పార్టీ పట్టించుకోలేదని మరింత రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో ఆదిమూలం టీడీపీలో చేరిక విషయమై ఆ పార్టీలో వాడివేడి చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో మాజీ మంత్రి ఆదిమూలం దగ్గరుండి చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వించిన విషయాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ రోజు చొక్కా విప్పి చంద్రబాబు ముందు అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన ఆదిమూలం సురేశ్ అధినేత చంద్రబాబుపై పరుష పదజాలం ప్రయోగించారని చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆదిమూలం చేరికపై నిర్ణయం తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిమూలం ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో ఏదైనా కామన్ అని అనుకుంటే ఆదిమూలం చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమేనని అంటున్నారు.

Tags:    

Similar News