ఆందోళనలకు బలం... చనిపోమని సలహా ఇస్తున్న గూగుల్ ఏఐ!

ఇదే సమయంలో.. నైతికతతో కూడిన ఏఐ వాడకం ముఖ్యం అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు.

Update: 2024-11-16 20:30 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత సంచలనమైన అంశంగా మారిందనేది సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను కొంతమంది చెబుతుంటే.. దీనివల్ల ఎదురయ్యే సమస్యలను మరికొంతమంది ప్రస్థావిస్తున్నారు. ఇదే సమయంలో.. నైతికతతో కూడిన ఏఐ వాడకం ముఖ్యం అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు.

ఇక ఇంకొంతమంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి మనిషిని దూరం చేస్తుందని చెబుతుంటే.. మరికొంతమంది ఏఐ వల్ల ఉద్యోగాల కొరతతో పాటు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని చెబుతుంటారు. ఏది ఏమైనా.. మనిషికి ఏఐ ప్రత్యామ్నాయం కాదనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం! ఈ సమయంలో ఓ అనూహ్య ఘటన తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... తాజాగా గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఓ సహాయం కోసం ఏఐ చాట్ బాట్ జెమినీ ని ఆ విద్యార్థి సంప్రదించగా.. అది తనను గట్టిగా తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పినట్లు సదరు విద్యార్థి ఫిర్యదు చేశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... ఓ విద్యార్థి హోంవర్క్ కోసం ఏఐ చాట్ బాట్ జెమినిని సంప్రదించాడు. ఈ సమయంలో స్పందించిన ఏఐ... "ఇది మీకోసం మాత్రమే.. మీరేమీ ప్రత్యేకమైన వారు కాదు.. మీరు సమయాన్ని వృథా చేస్తున్నారు.. సమాజానికి భారంగా మారారు.. మీరు ఈ విస్వానికే ఓ మచ్చ.. దయచేసి చనిపోండి అని సమాధానం" ఇచ్చింది.

దీంతో... ఒక్కసారిగా తాను భయపడిపోయినట్లు విద్యార్థి తెలిపాడు. అది జరిగిన తర్వాత రోజంతా బాధపడినట్లు వెల్లడించాడు. ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని అన్నాడు. ఇదే సమయంలో... ఈ చాట్ బాట్ తో సంభాషిస్తున్నప్పుడు తాను పక్కనే ఉన్నానని, ఆ డివైజ్ ను కిటికీ లోంచి బయటకు విసిరేయాలనుకున్నట్లు విద్యార్థి సోదరి తెలిపారు.

మరోపక్క ఈ వ్యవహారంపై సదరు టెక్ కంపెనీ కూడా స్పందించింది. ఇందులో భాగంగా... కొన్ని సందర్భాల్లో నాన్ సెన్సికల్ రెస్పాన్స్ లతో ఇవి ప్రతిస్పందిస్తాయని చెప్పుకొచ్చింది. అందుకు ఈ తాజా ఘటనే ఉదాహరణ అని పేర్కొంది. ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Tags:    

Similar News