పని కంటే చంద్రబాబు ప్రచార డోస్ ఎక్కువైందా?

కాబట్టి.. విజయవాడలో జలవిలయం ఆయన సమర్థతను మరింత మందికి తెలిసేలా చేస్తుందని చెప్పక తప్పదు.

Update: 2024-09-04 05:30 GMT

మిగిలిన విషయాల్ని వదిలేస్తే.. రెస్క్యూ లీడర్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వంక పెట్టలేం. మామూలు సమయాల్లో కంటే కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆయన పని చేసే తీరు.. స్పందించే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్త కాదు. సమస్యలు.. సవాళ్లు కూడా ఆయనకు తెలియనివి కావు. విపత్తులు విరుచుకుపడినప్పుడు ఎలా వ్యవహరించాలి? ఏ ఆర్డర్ లో పని చేసుకుంటూ పోవాలన్న దానిపై ఆయనకు మాంచి పట్టు ఉంది. కాబట్టి.. విజయవాడలో జలవిలయం ఆయన సమర్థతను మరింత మందికి తెలిసేలా చేస్తుందని చెప్పక తప్పదు.

74 ఏళ్ల వయసులో ఉదయం నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు పని చేయటం.. భారతదేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేరన్నది నిజం. అంతేనా.. ఆ తర్వాతి రోజు అర్థరాత్రి రెండు గంటలవరకు పని చేస్తూనే ఉండటం.. మెరుగైన పరిస్థితుల కోసం ఆయన పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. ప్రక్రతి విసిరిన సవాళ్లు ఒక ఎత్తు అయితే.. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే అడ్డంకులు మరో ఎత్తు. గతంలో ఇలాంటివి ఎదుర్కొనే విషయంలో ఆయన తడబడేవారు.

గడిచిన ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఆయన చాలా రాటుదేలారు. కొత్త తరహా రాజకీయాన్ని అర్థం చేసుకోవటం.. సమయానికి తగ్గట్లు స్పందించే ధోరణిని అలవాటు చేసుకున్నారు. గతంలో చాలా అంశాల్ని పట్టించుకోని ఆయన.. ఇప్పుడు అన్ని అంశాల్ని ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ చూసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. తానేం చేసినా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయటం.. అంచనాలకు భిన్నమైన ఆరోపణలతో కొత్త తరహా ప్రచారానికి తెర తీసే అంశాన్ని గుర్తించి.. వారి కంటే ముందు తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకస్థాయి వరకు ఇవన్నీ బాగానే సహా యఉంటాయి కానీ..మోతాదు మించితే మొదటికే మోసం వస్తుందనన విషయాన్ని ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది.

బెజవాడను ముంచెత్తిన వరద ఎపిసోడ్ ను చూస్తే.. అందరు ఇబ్బంది పడే వయసు కష్టాలకు భిన్నంగా.. అసలుసిసలైన పని రాక్షసుడు ఎవరైనా ఉంటే.. అది తానేనన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగేలా చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో సహాయక చర్యలు పెరిగే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొదటి రోజు సందర్భానికి తగ్గట్లు.. ఆయన కష్టాన్ని హైలెట్ చేయటం వరకు బాగానే ఉన్నా.. రాన్రాను.. ప్రచార మోతాదు పెరిగిపోయిందన్న భావన పలువురి నోట వ్యక్తమవుతోంది.

రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శల్ని.. ఆరోపణల్ని తిప్పి కొట్టటంలో సక్సెస్ అవుతున్న చంద్రబాబు.. ప్రజల నుంచి వస్తున్న వినతులు.. విన్నపాల్ని పరిష్కరించే విషయంలో.. వారు కోరుకున్న వేగంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే విషయంలో కాస్తంత వెనుకబడిన పరిస్థితి. దీంతో మోతాదుకు మించిన ప్రచారాన్ని చేసుకుంటున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నమాట పలువురి నోట వినిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు.

Tags:    

Similar News