హైదరాబాద్ పరువు తీసిన బనానా మ్యాన్

అలాంటి కోవకు చెందిన ఒక చిరు వ్యాపారి దురాశ.. వీడియోగా మారి ఇప్పుడు వైరల్ అవుతోంది.

Update: 2025-01-19 04:28 GMT

ఒకడి కక్కుర్తి ఊరి మొత్తానికి తలవంపులు తెచ్చి పెడుతుందన్న మాటకు తగ్గట్లే ఉంది ఇప్పుడు చెప్పే ఉదంతం. విదేశీయుడు ఎవరైనా మన దేశానికి వచ్చినప్పుడు.. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. అలాంటి కోవకు చెందిన ఒక చిరు వ్యాపారి దురాశ.. వీడియోగా మారి ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్రిటన్ దేశస్థుడు ఒకరు.. భారత్ లోని ఒక అరటిపండ్ల తోపుడు వ్యాపారిని ఒక అరటి పండు ఎంత? అని అడగ్గా.. రూ.వందగా చెప్పటం ఈ వీడియోలో కనిపిస్తుంది.

సదరు విదేశీయుడు పదే.. పదే ఒక అరటి పండు వంద రూపాయిలా? అని అడగటం.. సదరు చిరు వ్యాపారి అవునని తేల్చి చెప్పటం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో.. ఒక అరటి పండు వందా? అంటూ షాక్ కు గురి కావటంతో పాటు.. అంత ధర పెట్టి తాను కొనలేనని చెప్పేస్తాడు. తమ దేశంలో వంద రూపాయిల(ఒక పౌండ్ కు)కు ఎనిమిది అరటిపండ్లు వస్తాయని చెబుతాడు.

ఈ వీడియో హైదరాబాద్ లో షూట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఓవర్ ప్రైస్డ్ ఇన్ఇండియా అన్న క్యాప్షన్ తో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ వీడియో పై పలువురు స్పందిస్తున్నారు. డజను అరటి పండ్లు మహా అయితే.. రూ.40 - 50 మధ్య అమ్ముతున్న దానికి భిన్నంగా విదేశీయుడి వద్ద ఒక అరటిపండును వంద రూపాయిలకు అమ్మాలని ప్రయత్నించిన వ్యక్తి దేశానికి తలవంపులు తెచ్చినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరి కక్కుర్తి అందరికి చెడ్డపేరు తెచ్చి పెడుతుందని.. దేశ ఇమేజ్ ను దెబ్బ తీస్తుంందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News