వైసీపీలో గొంతులు లేస్తున్నాయి...జగన్ కి వినిపిస్తోందా ?
ఇదిలా ఉంటే ప్రాంతీయ పార్టీలలో చూస్తే ఏపీలో టీడీపీ సుదీర్ఘ కాలంగా ఉంది.
సహజంగా ప్రాంతీయ పార్టీలలో అధినేతలదే పెత్తనం. వారే సర్వ సత్తాక అధికారాలు చలాయిస్తారు. కాదని అంటే ఆయా పార్టీలలో వారికి ఫ్యూచర్ ఉండదని చెబుతారు. అదే జాతీయ పార్టీలలో అయితే స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. అంచెలంచెల వ్యవస్థ ఉంటుంది. దాంతో ఏదో ఒక చోట సర్దుబాట్లు ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రాంతీయ పార్టీలలో చూస్తే ఏపీలో టీడీపీ సుదీర్ఘ కాలంగా ఉంది.
టీడీపీలో అధికారాలు అన్నీ చంద్రబాబు చుట్టూ తిరిగినా అక్కడా ఎంతో కొంత ప్రజాస్వామిక పోకడలు కనిపించేలా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంతిమ నిర్ణయం అధినాయకత్వం తీసుకున్నా దాని మీద ఒక చర్చ ఒక విధానం అన్నది కనిపిస్తుంది. దానితో పాటు ఎవరైనా అసంతృప్తికి లోను అయినా వారిని సరిచేసే వ్యవస్థ కూడా ఉంటుంది.
ఇక వైసీపీ విషయానికి వస్తే మాత్రం అలా ఏమీ లేదు అనే అంటారు. అక్కడ కూడా కార్యవర్గాలు వ్యవస్థలు అన్నీ ఏర్పాటు చేసినా లోతైన చర్చ లేకుండా అధినాయకత్వం అనుకున్నదే అమలు చేస్తారు అన్న భావన అయితే ఎందుకో ప్రచారంలో ఉంది. ఇక వైసీపీలో జగన్ కి ఎదురు నిలిచి మాట్లాడినా తమ అభిప్రాయాలను చెప్పాలనుకున్నా కుదిరే వ్యవహారం కాదన్న మాటా ఉంది.
ఇదిలా ఉంటే తొమ్మిది నెలల క్రితం ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. అయితే దానికి ఒప్పుకోవడానికి ఆయా పార్టీల నేతలు సీనియర్లు ఇపుడే ముందుకు వస్తున్నారు. అంతే కాదు వారు పార్టీలో జరిగిన తప్పులను కూడా విప్పి చెబుతున్నారు. ఇలా జరగాల్సింది కాదు అని అంటున్నారు. పార్టీలో ఈ లోపాల వల్లనే ఓటమి పాలు అయ్యామని డేరింగ్ గానే బయటకు వచ్చి మీడియాతో చెబుతున్నారు.
అనంతపురానికి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఈ విషయంలో కుండబద్దలు కొట్టారు. పార్టీలో తప్పులు జరిగాయని ఆయన అంటున్నారు. మంచి చేసినా చెప్పుకోలేకపోవడంతో పాటు విపక్షాన్ని మరీ గట్టిగా టార్గెట్ చేయడం వల్ల కూడా ఓటమి సంభవించింది అని ఆయన విశ్లేషిస్తున్నారు. వైసీపీ తన తప్పులను పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సి ఉందని అంటున్నారు.
ఇక మరో సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఓడాం, ఘోరంగా ఓడామని పెద్ద నోరు చేశారు. అది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే అని నొక్కి చెప్పారు. ఎక్కడ 151 సీట్లు మరెక్కడ 11 సీట్లు అని కూడా అన్నారు. జగన్ కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వచ్చి సీఎం గా ప్రమాణం చేస్తారని అంతా అనుకున్నామని కానీ దారుణమైన ఫలితాలు వచ్చాయని అంబటి చెప్పుకొచ్చారు.
అదే సమయంలో ఇంతటి వ్యతిరేకత ఉంటుందని అసలు ఊహించనైనా లేదని అన్నారు. టీడీపీ కూటమికి 164 సీట్లు రావడం వారికి ఎంత ఆశ్చర్యం కలిగించిందో తమకు 11 సీట్లు రావడం కూడా అంతేలా అయిందని అన్నారు. దీంతో పార్టీ పునర్నిర్మాణానికి జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
మొత్తానికి చూస్తే వైసీపీలో చాలా మంది నేతలు ఇపుడిపుడే గొంతు విప్పుతున్నారు. నేను వింటాను నేను ఉంటాను అని 2019 ఎన్నికల వేళ జగన్ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన బలమైన నినాదం. మరి ఇపుడు అదే జగన్ పార్టీ నేతల నుంచి వస్తున్న స్పందనను వింటున్నారా అన్న చర్చ వస్తోంది.
ఎందుకంటే పార్టీలో ఉన్న వారు చెప్పేది నిజాయతీగా సమీక్ష జరగాలన్నదే అంటున్నారు. గడచిన తొమ్మిది నెలల కాలంలో ఆ పని జరగలేదన్నది మెజారిటీ నేతల భావంగా ఉంది. ఈవీఎంల వల్లనే ఓటమి పాలు అయ్యామమో లేక చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం దక్కించుకున్నారనో ఏవో ఒక విధంగా తమను తాము మభ్య పెట్టుకుంటే ఇచ్చే ప్రకటనల వల్ల ఉపయోగం ఉండదని పార్టీలో కీలక నేతలకు అర్ధం అయింది అని అంటున్నారు
పార్టీ విధానాల పట్ల ప్రభుత్వం అయిదేళ్ళ పాటు నడిపిన తీరు పట్ల జనాలలో వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాలని వాటిని సరిచేసుకోవాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే పార్టీలో లేస్తున్న గొంతుల వెనక ఉన్న సూచనలను అధినాయకత్వం అర్థం చేసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని భావిస్తున్నారు.