ఇది బీజేపీ జమిలి... అందుకేనా విపక్షం నో చెబుతోంది ?

అయితే 2018లో కేసీఆర్ జమిలి గొలుసు నుంచి విడివడి ఆరు నెలల ముందు ఎన్నికలు పెట్టారు.

Update: 2024-12-17 23:30 GMT

ఈ దేశానికి జమిలి ఎన్నికలు కొత్త కాదు. ఆ మాటకు వస్తే ఇప్పటికీ లోక్ సభతో పాటు ఏపీ, ఒడిషా తదితర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కలిపే జరుగుతున్నాయి. తెలంగాణా కూడా అందులో భాగమే. అయితే 2018లో కేసీఆర్ జమిలి గొలుసు నుంచి విడివడి ఆరు నెలల ముందు ఎన్నికలు పెట్టారు.

ఈ విషయం అలా ఉంచితే జమిలి ఎన్నికలు అన్నది 1952లో మొదటి సారి జరిగాయి. అప్పటికి రెండేళ్ళ ముందు భారత రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది. దానిని అనుసరించి జరిగిన తొలి సార్వత్రిక ఎన్నిక అది. ఆనాటికి దేశంలో పద్నాలుగు రాష్ట్రాల దాకా ఉండేవి. జనాభా ముప్పయి అయిదు కోట్లు అంటే అందులో పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేసుకోవచ్చు.

అలా జరిగిన ఎన్నికలు కాస్తా 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఎక్కువ అయ్యాయి. అవి కాస్తా 160 దశకం చివరికి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీల పుట్టుక మరో కారణం. దేశానికి కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని ఆదరిస్తూ వచ్చిన 1952, 1957, 1962, 1967 ఎన్నికల తరువాత జనాలలో కొత్త ఆలోచనలు వచ్చాయి.

ఇక తమకు ఏమిటి ప్రయోజనం అన్న ఆలోచనతో జనాలు ఉన్నారు. తమిళనాట డీఎంకే ఏర్పాటు జరిగింది. మహారాష్ట్రలో శివసేన స్థానిక ఉద్యమాలు మొదలయ్యాయి. ఇక జనసంఘ్ గా 1953లో ఏర్పాటు అయిన పార్టీ ఆ తరువాత పుంజుకుంది. నెహ్రూని మొదట్లో సపోర్టు చేసిన వామపక్షాలు కూడా ప్రజా ఉద్యమాలతో తమ రాజకీయానికి పదును పెట్టాయి. ఇలా దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక శిబిరానికి అంకురార్పణ జరిగింది. చాలా చోట్ల జనసంఘ్ ఇతర పార్టీలతో రాష్ట్ర ప్రభుత్వాలూ ఏర్పాటు అయ్యాయి. అలా జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది.

ఇక 1971లో మరోసారి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ఆరేళ్ల పాటు పార్లమెంట్ కి ఎన్నికలు పెట్టలేదు. దాంతో పాటుగా రాజకీయ కక్ష సాధింపు మొదలైంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ప్రభుత్వాలను రాష్ట్రపతి పాలనతో కూలగొట్టే రాజకీయ తంత్రాలు స్టార్ట్ అయ్యాయి. అలా 1970, 80 దశకంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.

ఇక 1990 దశకం వచ్చేసరికి కేంద్రంలోని ప్రభుత్వాలే అయిదేళ్ల పాటు సాగని పరిస్థితి. వీపీ సింగ్ పదకొండు నెలలు ఆరు నెలలు చంద్రశేఖర్ పాలించాక నేషనల్ ఫ్రంట్ గద్దె దిగింది. మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. రాజీవ్ గాంధీ మరణాంతరం పీవీ నరసింహారావు ప్రధాని అయి అయిదేళ్ళ పాటు ప్రభుత్వాన్ని నడపడం ఒక ముచ్చట. ఆ తరువాత కూడా యునైటెడ్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాల్లో ఏదీ అయిదేళ్ళ పాటు సాగలేదు వాజ్ పేయ్ మూడవసారి ప్రధాని అయినా నాలుగున్నరేళ్ళ పాటే పాలించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

గట్టిగా చెప్పాలీ అంటే గడచిన రెండు దశాబ్దాల కాలంలోనే అయిదేళ్ల పాటు కేంద్రంలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రాష్ట్రాలలో అనేక పార్టీలు ఉన్నాయి. అవి కూడా అధికారం కోసం పోటీ పడుతూ తమదైన రాజకీయం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పూర్తి మెజారిటీ ఉన్నా మరోసారి గెలుద్దామని ముందస్తు ఎన్నికలకు వెళ్లే రాజకీయ వ్యూహాలు కూడా అమలు అవుతున్నాయి.

ఇలా కనుక చూసుకుంటే ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఎన్నో భావాలు ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు ఇంకా చిన్న పార్టీలతో రాజకీయం సాగుతోంది. ఒక విధంగా ప్రజాస్వామ్యానికి ఇది మేలు చేసే విషయమే. ఎక్కువ చాయిస్ ఉంటే ఓటరు మంచి నిర్ణయం తీసుకోగలడు అని చెబుతారు

కానీ అదే సమయంలో ఆయా ప్రభుత్వాల రాజకీయ మనుగడ కూడా ఇబ్బందుల్లో పడుతోంది. చిన్న రాష్ట్రాలలో మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక రెండు మూడు పార్టీలు జట్టు కట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఆనక విభేదాలతో విడిపోవడం జరుగుతోంది. మరి అపుడు అర్ధాంతరంగా ప్రభుత్వాలు పడిపోతే ఏమి చేస్తారు అన్నది జమిలి ఎన్నికల విషయంలో ఉత్సాహం చూపించేవారు ఆలోచించాలి.

ముందే చెప్పుకున్నట్లుగా కాంగ్రెస్ మాదిరిగా ఏకపక్షంగా దేశం మొత్తం ఒకే పార్టీ పాలించే రోజులు కావు ఇవి. పైగా ఒకేసారి ఎన్నికలు అంటే దానికి కూడా ఖర్చు ఏమీ తక్కువ కాదు. అయినా ప్రజాస్వామ్యంలో ఖర్చు చూసుకుంటారా అని మేధావులు అంటున్న మాట. భారత్ లాంటి భిన్నమైన భాషలు అలవాట్లు, ఆచారాలు ఉన్న దేశంలో అందరినీ ఒక గాటకి కట్టేసి జమిలి ఎన్నికలు అంటే అది కుదురుతుందా అన్నది పెద్ద చర్చ.

ఏది ఏమైనా బీజేపీ జమిలి బిల్లుని తెచ్చింది. కానీ దాని ఆమోదం విషయంలో ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. గతంలో కూడా జమిలి ఎన్నికలు జరిగాయి బీజేపీ నేతలు చెబుతున్నా విపక్షాలు తగ్గడం లేదు. ఎందుకంటే ఇది బీజేపీ జమిలి అంటున్నారు. అంటే అందులో వారికి కొత్త భయాలు ఏవో ఉన్నాయన్న మాట. అవి తేలేంతవరకూ ఈ బిల్లు చట్టం అవుతుందా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News