కేసీఆర్ జగన్ భేటీ...ఫిబ్రవరి మొదటి వారంలో ?

అటువంటి ఈ ఇద్దరూ ఒకేసారి ఆరు నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు.

Update: 2025-01-21 22:30 GMT

అవును వారిద్దరూ భేటీ కాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. గత అయిదేళ్ల పాటు ఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీల అధినేతలూ ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్ జగన్ ఇద్దరూ అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరూ ఎపుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. పైగా మంచి సంబంధాలనే కొనసాగించారు. అటువంటి ఈ ఇద్దరూ ఒకేసారి ఆరు నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు.

మాజీ సీఎం గా కేసీఆర్ కి ఏడాది కాలం గడిస్తే జగన్ కి ఏడు నెలల కాలం గడచింది. ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా సాగుతోంది. తెలంగాణాలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పడుతున్నాయి. అదే టైం లో ఏపీలో కూడా వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి.

ఇక చూస్తే కనుక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ టీడీపీ మూలాలే. రేవంత్ రెడ్డికి బాబు మీద గురు భావం ఉంది. అలాగే శిష్యవాత్సల్యం బాబుకు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇలా పార్టీలు ప్రాంతాలూ వేరు అయినా ఈ ఇద్దరి మధ్యన మంచి అన్యోన్య బంధమే ఉంది అని అంటున్నారు.

ఈ క్రమలో అక్కడా ఇక్కడా విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాస్లిందే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే కేసీఆర్ జగన్ కలవవచ్చు అని అంటున్నారు. అది జరుగుతుంది అని రెండు పార్టీల వైపు నుంచి వినిపిస్తున్న మాట.

ఈ ఇద్దరూ మాజీ సీఎంలు అయ్యారు. మరి కలసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారు అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలి ఏ రకంగా అధికారంలోకి రావాలి అన్న దాని మీద ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారు అని అంటున్నారు.

ఇక పోతే అధికారంలో ఉన్న చంద్రబాబు రేవంత్ రెడ్డి బాగా ఉన్నపుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇద్దరు నేతలూ కలిస్తే తప్పేంటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకరికి ఒకరు తోడుగా నీడగా కలసి ముందుకు వెళ్తే మంచిదే అని కూడా భావిస్తున్నారుట. విపక్షంలో ఉన్నారు, కాబట్టి ఉమ్మడిగా కలసి వెళ్తే మరింతగా రాజకీయం రాటు తేలుతుందని కలసి ఏదైనా సాధించవచ్చు అన్న ఆలోచనలతో సాగుతున్నారని అంటున్నారు.

ఇక చూస్తే జాతీయ రాజకీయాల్లో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎండీయే కూటమి ఎప్పటి నుంచో ఉంది. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండింటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ లేవు.

దాంతో ఈ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకూ ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకు వెళ్తాయన్నది కూడా తెలియడం లేదు. ఆ విషయం మీద కూడా ఈ రెండు పార్టీలు కలసి కూర్చుని చర్చిస్తాయా అన్నది కూడా ఉంది. ఇక అధికారంలో ఉన్నపుడు బీజేపీతో పరోక్ష చెలిమిని నెరపించిన చరిత్ర వైసీపీది. ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీని తరువాత కాలంలో వ్యతిరేకించింది.

ఇపుడు చూస్తే ఈ రెండు పార్టీలకు పార్లమెంట్ లో కొంత బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సి ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలసికట్టుగా ఉంటే ఏ కూటమి అయినా వీరి వైపు చూసే చాన్స్ ఉంది అని అంటున్నారు. వ్యూహాలు వేయడంతో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయంలో జగన్ ది అందె వేసిన చేయి. మరి ఈ ఇద్దరూ కలిస్తే మాత్రం తెలుగు రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News