మనలో మనం: తమ్ముళ్ల కొత్త కాన్సెప్టు... !
ఇదీ.. ఇప్పుడు మనంలో మనం కాన్సెప్టు అమలవుతున్న తీరు.
By: Tupaki Desk | 23 Nov 2024 9:30 PM GMTఏపీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. కొత్త కాన్సెప్టును తెరమీదికి తెచ్చారు. అదే.. ''మనంలో మనం!''. అంటే.. అందరూ కలివిడిగా ఉంటారు. ఎక్కడా వివాదాలకు పోరు. మరీ ముఖ్యంగా పెద్దాయన చంద్రబాబు వద్ద పంచాయతీలకు అసలేపోరు. తమలో తామే సర్దుకుపోతారు. ఇదీ.. ఇప్పుడు మనంలో మనం కాన్సెప్టు అమలవుతున్న తీరు. ఇది ఆశ్చర్యంకాదు.. కల్పితం అంతకన్నాకాదు. పచ్చినిజం. అయితే.. ఇదేదో ప్రజాసేవ కోసం చేస్తున్నది కూడా కాదు.
ఇసుక, మద్యం సహా ఇతర వ్యాపారాలకు సంబంధించి తమ్ముళ్ల మధ్య ఏర్పడుతున్న విభేధాలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇవి మీడియాలోనూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక, వీటి పంచాయతీ చంద్రబాబుకు మరింత తలనొప్పిగా మారుతోంది. దీనివల్ల ఆయన వార్నింగులు ఇవ్వడం.. క్షేత్రస్తాయిలో ఏం జరుగుతోందో అని కమిటీలు వేసే పరిస్థితి కూడా వస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి కారణం.. తమ్ముళ్ల మధ్య పంపకాలకు సంబంధించిన రగడే!
ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన కర్నూలు, అనంతపురం, కడప వంటి జిల్లాల్లో తమ్ముళ్లు మనలో మనం అనే కాన్సెప్టును అమలు చేస్తున్నారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా.. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అటైనా ఇటైనా ఫర్వాలేదు కానీ.. ఎక్కడా పంచాయతీ మాత్రం జరగకూడదని, పెద్దాయన వరకు విషయం వెళ్లకూడదని తీర్మానం చేసుకుని.. ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం బెల్టు షాపుల నుంచి ఇసుక అక్రమాల వరకు అనేక జిల్లాల్లో తమ్ముళ్ల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు కూడా వచ్చింది. ఇవి తలనొప్పులుగా మారి.. అసలుకే ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనలో మనం సర్దుకుపోతే.. ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన తమ్ముళ్లు.. ఈ విషయంలో చేతులుకలిపారు. దీంతో తొలినాళ్లలో వచ్చినన్ని విమర్శలు కానీ.. తొలినాళ్లలో ఎదురైనన్ని విమర్శలు కానీ.. ఇప్పుడు లేకపోవడం గమనార్హం.