షర్మిల ఇప్పుడు రేవంత్ రెడ్డి పై మాట్లాడుతుందా?
అయితే ఇదే సమయంలో ప్రత్యర్థులు ఆపై విమర్శలు సైతం ఎక్కువ పెడుతున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇప్పుడు తెలుగు నాట రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కుటుంబ ఆస్తి పంపకాల వివాదంలో సొంత సోదరుడైన జగన్‌ను బహిరంగంగా లేఖల ద్వారా ప్రశ్నించడం, దుమ్మెత్తిపోయడంతో ఆమె తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఇదే సమయంలో ప్రత్యర్థులు ఆపై విమర్శలు సైతం ఎక్కువ పెడుతున్నారు. తాజాగా ఈ విషయంలోకి రేవంత్ రెడ్డిని ఎపిసోడ్ ప్రస్తావిస్తున్నారు.
వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాజకీయాలకే పరిమితమైనప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తదనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం షర్మిల తెలంగాణ రాజకీయాలను వదిలేసి ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడం, కాంగ్రెస్‌లో చేరడం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మారడం... తెలిసిన సంగతే. దాంతో సహజంగానే రేవంత్ పై విమర్శలు పక్కకు పోయాయి. అంతేకాకుండా దివంగత వైఎస్ వర్థంతి సభలో సభకు రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలిచి మరి షర్మిల కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే, తాజా ఎపిసోడ్‌లో మరోమారు రేవంత్ రెడ్డి విషయంలో షర్మిల గురించి రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అదే మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో రెండు వందల కోట్లు విరాళం ఇవ్వడం, రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయినా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు తామే చేపడతామని ప్రకటించడం నేపథ్యంలో...తెలంగాణ సీఎం, ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డిని షర్మిల ప్రశ్నిస్తుందా అంటూ పలువురు ఆసక్తిగా కామెంట్ చేస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించడంలో భాగంగా ఆయన చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో మేఘా సంస్థ అవినీతికి పాల్పడిందని, అంతేకాకుండా జగన్ రెడ్డి నిబంధన విరుద్ధంగా ఆ కంపెనీకి డబ్బులు దోచి పెట్టారని విమర్శలు గుప్పించారు. ఇటు మేఘా కంపెనీని అటు జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తి పోశారు. మరి ఇప్పుడు అదే రీతిలో గతంలోనూ రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా మేఘా సంస్థను తెలంగాణలో చేపట్టిన పనులను తప్పుపట్టారు. మరిప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రితో మేఘా సంస్థ కలిసి పనిచేస్తుండడానికి షర్మిల ఎందుకు తప్పు పట్టరు? అంటూ వైఎస్ఆర్‌సీపీ వర్గాలు షర్మిల ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాయి. మేఘా కంపెనీ మారలేదు... రేవంత్ రెడ్డి మారలేదు కానీ పార్టీ మారిన షర్మిల వైఖరి ఎందుకు మారింది? అంటూ ప్రశ్నలకు ఒప్పిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ చేసే ప్రతి కామెంట్ కి కౌంటర్ ఇస్తున్న షర్మిల దీనికి ఏం సమాధానం ఇస్తుందో వేసి చూడాల్సిందే.