జగన్ కి బ్యాడ్ పీరియడ్ నడుస్తోందా ?

తన వారు ఎవరో పరవారు ఎవరో కూడా తెలియనంత తేడాలో జగన్ ఉన్నారు.

Update: 2024-09-25 03:41 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జాతకాలను నమ్ముతారో లేదో తెలియదు కానీ ఆయన వర్తమాన రాజకీయం చూస్తే బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది అనే అంటున్నారు. వైసీపీని ఆరు నెలల క్రితం వరకూ ఆహో ఓహో అన్న వారు జగన్ ని ఇంద్రుడు చంద్రుడు అన్న వారు కూడా చాలా సైలెంట్ గా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు.

తన వారు ఎవరో పరవారు ఎవరో కూడా తెలియనంత తేడాలో జగన్ ఉన్నారు. ఆయన పక్కనే ఉంటున్న వారు కూడా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా వెళ్ళిన వారు అంతా జగన్ మీదనే నిందలు వేస్తున్నారు. మరి వీరికి ఇన్నేళ్ళ పాటు నచ్చిన జగన్ ఇపుడు ఒక్కసారిగా ఎందుకు చెడ్డ అయిపోయారో అర్థం కావడం లేదు అని కూడా అంటున్నారు.

జగన్ ఎపుడూ ఒకేలా ఉన్నారని ఆయన మారింది లేదని కూడా పక్కన ఉన్న వారూ సన్నిహితంగా ఉన్న వారూ చెబుతున్న మాట. ఆయన ఆదుకున్న వారు ఓడినా పదవులు ఇచ్చిన వారూ ఎక్కడో ఉన్నా కూడా అందలం ఎక్కించి పెద్దల సభకు పంపించి గౌరవించిన వారు ఇపుడు చాలా ఈజీగా వైసీపీ జెండాను పీకేస్తున్నారు

దాంతో జగన్ ఎంపికలు తప్పా అన్న చర్చ కూడా వస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఇచ్చిన పదవులు అందుకున్న వారూ దెబ్బేస్తున్నారు. అలాగే వీర విధేయులు తండ్రి వైఎస్సార్ కాలం నుంచి తన వెంట ఉన్న వారిని ఆదరించినా వారు కూడా వద్దు పార్టీ అని కష్టకాలంలో తప్పుకుంటున్నారు.

మరి ఏ విధంగా జగన్ చేసినది తప్పు అన్న చర్చ కూడా వస్తోంది. సాధారణంగా పదవులు తీసుకున్న వారు పార్టీలో ఉంటారు. పోయిన వారే గేటు దాటుతారు. కానీ వైసీపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదిలేసుకుని వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్సీలూ కొందరు అదే రూట్లో ఉన్నారు.

వీరి తీరే ఇలా ఉంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల సంగతి ఊహించగలమా అన్న చర్చ నడుస్తోంది. ఇదంతా జగన్ చేసుకున్నదేనా లేక రాజకీయమే అలా ఉందా అన్నది కూడా లోతైన చర్చ సాగుతోంది. జగన్ అయినా ఎవరు అయినా పదవులు ఇచ్చినంతవరకే. తీసుకున్న వారికే ఆ విధేయత పార్టీ పట్ల నిబద్ధత ఉండాలి అని అంటున్నారు. ఆ విషయంలో టీడీపీ బెటర్ అని అంటున్నారు.

అక్కడా పార్టీ అయిదేళ్ల క్రితం ఘోరగా ఓడింది. కానీ ఎవరూ బయటకు పెద్దగా రాలేదు. దానికి కారణం చంద్రబాబు అనుసరించిన విధానమే అని అంటున్నారు. ఆయన నేతలకు అందుబాటులో ఉంటూ వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తూ ఉందిలే మంచి కాలం అని సర్ది చెబుతూ భరోసా ఇచ్చారు అని అంటున్నారు.

వైసీపీలో చూస్తే పోయిన వారు పోనీయ్ అన్న విధానమే ఉంది తప్ప అధినేత పట్టించుకోవడం లేదు అన్న ఫిర్యాదు ఉంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ వైసీపీలో ఉన్న వారిలో ఎక్కువ మందికి పార్టీ ఫిలాసఫీ వంటబట్టింది లేదు అని అంటున్నారు. అందుకే వారు ఎమోషనల్ బాండేజ్ ఏదీ లేకపోవడం వల్లనే ఫ్రీగా పార్టీని వీడుతున్నారు అని అంటున్నారు.

ఇక మరో విషయం కూడా చర్చకు వస్తోంది. జగన్ మీద నమ్మకం తగ్గింది అని కూడా అంటున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ గెలుస్తుందా అన్నది కూడా డౌటు పెట్టుకునే ముందు చూపుతో నేతలు పార్టీని వీడుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా కాలం గొప్పది. అదే ఎవరిని అయినా మంచిగా చూపిస్తుంది. అది బాలేనపుడు ఇలాగే జరుగుతాయని అంటున్నారు. ఇపుడు వైసీపీకి జగన్ కి బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది అని మంచి రోజులు మళ్లీ వస్తాయని ఆ పార్టీలో ఆశావహులు అంటున్న మాట. సో వెయిటింగ్ ఫొర్ బెటర్ టైం అని భావించడమే అంటున్నారు.

Tags:    

Similar News