ఈ ఓట్లు వైసీపీవి కావా...కూటమి పట్ల వ్యతిరేకత ఉందా ?
నిజంగా కనుక వ్యతిరేకత ఉంటే ఎక్కడో ఒకచోట ప్రతిబింబించాలి కదా అన్నది చర్చగా ఉంది.;
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు అవుతోంది. ఈ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉందని పదే పదే వైసీపీ అధినాయకత్వం అంటూ వస్తోంది. నిజంగా కనుక వ్యతిరేకత ఉంటే ఎక్కడో ఒకచోట ప్రతిబింబించాలి కదా అన్నది చర్చగా ఉంది.
తాజాగా చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కనీ వినీ ఎరుగని తీరులో టీడీపీ అభ్యర్థులకు మెజారిటీలు దక్కాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థాయిలో మెజారిటీలు వస్తాయా అని అంతా ఆశ్చర్యపోయేలా ఈ ఆధిక్యతలు ఉన్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే పట్టభద్రుల ఎన్నికలు జరిగినవి ఉమ్మడి కృష్ణా గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో. ఇక్కడ చూస్తే మొత్తం అసెంబ్లీ సీట్లు 61 ఉన్నాయి. అంటే ఏపీ అసెంబ్లీలో అధికారానికి దగ్గర చేసే అత్యంత కీలక నంబర్ అన్న మాట.
పైగా ఈ జిల్లాలు రాజకీయంగా చైతన్యవంతమైనవి. ఇక్కడ మార్పు వస్తే మొత్తం ఏపీలోనే అది కనిపిస్తుంది. 2024 మేలో ఎన్నికలు జరిగినపుడు ఈ జిల్లాలు కూటమి పార్టీలకు ఓటెత్తాయి. ఇక అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలోనూ కూటమి ప్రభుత్వం పట్ల జనంలో పెద్దగా వ్యతిరేకత ఏదీ లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అంటున్నారు.
కుప్పలు తెప్పలుగా ఓట్లు టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ పడ్డాయని చెబుతున్నారు. దీంతో కూటమికి మరింతగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలిగింది అని అంటున్నారు. అంతే కాదు అభివృద్ధి వైపు సాగుతున్న కూటమి ప్రభుత్వ ఆలోచనలకు ఊతమిచ్చినట్లుగా ఉందని అంటున్నారు.
పట్టభద్రులు అంటే విద్యావంతులు, సమాజం గురించి పూర్తి ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. ఈ రోజుల్లో పల్లె పట్నం తేడా లేకుండా కనీస విద్యార్హత డిగ్రీ ఉన్న వారే ఎక్కువ. అలాంటపుడు ఈ ఎన్నికల ఫలితాలు మొత్తంగా ప్రతిఫలించినట్లే అని అంటున్నారు.
నిరుద్యోగ భృతి చెల్లించలేదని యువత ఆగ్రహంగా ఉందని విపక్షాలు అంటున్నాయి. వైసీపీ ఇదే విషయం మీద పాయింట్ అవుట్ చేస్తోంది. కానీ నిరుద్యోగులు అయిన యువత కూడా జై కొట్టకపోతే టీడీపీకి ఇంతటి మెజారిటీ వచ్చేది కాదు కదా అని అంటున్నారు.
అదే విధంగా ఏపీలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటిదాకా ఇవ్వలేదని వైసీపీ అంటోంది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతోంది. తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పన జరుగుతుందని అంటోంది. దానిని యువత కచ్చితంగా నమ్ముతోందని కూడా ఈ ఫలితాలు చెబుతున్నాయని అంటున్నారు.
ఏపీలో సంక్షేమ పధకాలు గత పది నెలలుగా అమలు కాకపోయినా యువత మాత్రం కూటమికి ఎందుకు ఓటేసినట్లు అంటే ఈ పప్పు బెల్లాలు పంచడం కంటే అభివృద్ధి చేస్తేనే ఏపీకి శాశ్వతంగా ప్రగతి దక్కుతుందని భావిస్తున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
ఇక వైసీపీ విషయానికి వస్తే కూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అంటూ వచ్చారు. పైగా ఈవీఎంల వల్లనే తాము ఓడామని బ్యాలెట్ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇపుడు బ్యాలెట్ ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. దాంతో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ ఇప్పటికీ చెబుతుందా అన్నది ఒక చర్చగా ఉంది.
అదే సమయంలో ఈ ఓట్లు వైసీపీవి కావు రూరల్ సెక్టార్ ఓట్లు వివిధ ఇతర సెక్షన్ల ఓట్లే మావి అని చెబుతారా అన్నది కూడా ఉంది. 2023లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు కూడా టీడీపీకే అనుకూలంగా వచ్చాయి. ఆనాడు ఈ ఓట్లు మావి కావు అని వైసీపీ నేతలు అన్నారు. కానీ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. ఇపుడు చూస్తే ఈ ఓట్లు మావి కావు అని వైసీపీ అనగలదా అన్నదే ప్రశ్న. మొత్తానికి చూస్తే ఈ ఫలితాలను వైసీపీ మధింపు చేసుకుని ముందుకు అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు.