టీడీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా ?

ఇక ఆరు నెలల కాలాన్ని రాజకీయ పరిభాషలో హానీమూన్ అని అంటారు.

Update: 2024-10-07 02:30 GMT

ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నెల 12కి నాలుగు నెలలు పూర్తి అవుతుంది. అయినా ఇంకా చేతిలో 56 నెలలు ఉంటుంది. ఇక ఆరు నెలల కాలాన్ని రాజకీయ పరిభాషలో హానీమూన్ అని అంటారు.

అలా చూస్తే కనుక కూటమి ప్రభుత్వానికి ఇంకా అలా హానీమూన్ నడుస్తున్నట్లే. మరి ఇంతలో ఏమి అయిందని చెప్పి కూటమి పెద్దన్న కంగారు పడుతోంది అని చర్చించుకుంటున్నారు. కూటమిలో 144 సీట్లకు గానూ 135 సీట్లను సాధించి అద్భుతమైన మెజారిటీతో అధికార్మలో ఉన్న టీడీపీ ఇపుడు నాలుగు నెలల కాలంలో తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని సర్వే చేయిస్తోందిట.

ఎందుకు ఇంత హడావుడి అని కూడా దీనిని చూసిన వారు అనుకుంటున్నారు. ఇప్పట్లో ఏ ఎన్నికలూ లేవు. స్థానిక ఎన్నికలు అయితే 2026 మొదట్లో ఉంటాయి. అవి కావాలంటే వాయిదా కూడా వేసుకోవచ్చు. మరి హ్యాపీగా అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా ఈ సర్వేలు ఎందుకు అంటే అంతా ముందు జాగ్రత్త కోసమే అని అంటున్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల తమ్ముళ్ళకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ఉన్న పార్టీ కీలక నేతలతో ఫోన్ కలుపుతూ మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, మీ మంత్రి ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు అన్న వివరాలను సేకరిస్తున్నారుట.

ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటు పార్టీకే కాదు, ఇటు ప్రజలకు ఎంత వరకూ అందుబాటులో ఉంటున్నారు, స్థానికంగా ఉన్న సమస్యల మీద వారు అవగాహనతో ఉన్నారా వాటిని పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారా అన్నది కూడా ఆరా తీస్తున్నారుట. అంతే కాదు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ రకమైన అవినీతి అక్రమాల విషయంలో ఎలా ఉంటున్నారు అని కూడా అడుగుతున్నారుట.

ఇసుక కుంభకోణం కానీ ల్యాండ్ కుంభకోణం కానీ వీటిలో ఏమైనా ప్రమేయం ఎవరికైనా ఉందా అలా ఉన్న వారికి మద్దతు ఇస్తున్నారా అని కూడా వాకబు చేస్తున్నారుట. ఇక నియోజకవర్గాలలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది. ఎవరి మీద అయినా బెదిరింపులు చేస్తున్నారా లేక దందాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అడిగి తెలుసుకుంటోందిట. ఎందుకు ఇదంతా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాలుగు నెలల కాలంలో కొంత వరకూ వ్యతిరేకత అయితే వచ్చింది అని అంటున్నారు.

హామీలను సూపర్ సిక్స్ అని చెప్పి అమలు చేయలేకపోవడంతో మొదలైన అసంతృప్తి కాస్తా ఉచిత ఇసుక పాలసీ మార్చినా దొరకకపోవడం లా అండ్ ఆర్డర్ చాలా చోట్ల గత ప్రభుత్వం మాదిరిగానే ఉండడం అదే విధంగా భూ కబ్దాలు ఆరోపణలు అక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారం టీడీపీకి అలా ఇలా దక్కలేదు, అపరిమితంగా దక్కింది. దాంతో విపరీతంగా నేతలు కొందరు కొన్ని చోట్ల వ్యవహరిస్తున్నారు అని దాని వల్ల పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతోంది అన్న వార్తల నేపధ్యంలోనే ఈ విధంగా సొంత సర్వేలు అంచనాలు చేసుకుంటూ టీడీపీ ముందు జాగ్రత్త పడుతోంది అని అంటున్నారు.

టీడీపీకి ఇలాంటి మెకానిజం ఎపుడూ ఉంది. అందుకే ఆకులు కాలాక చేతులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే బాగుంటుందని అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ఈ రకమైన జాగ్రత్తలు లేకపోవడం వల్లనే

వైసీపీ దెబ్బ తిన్నదని గ్రహించి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ బహు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు మొత్తం మీద ఎమ్మెల్యేల పని తీరు విషయంలో వివిధ రకాలుగా సర్వేలు చేయిస్తూనే సొంత పార్టీ వారి ద్వారా కూడా అభిప్రాయ సేకరణకు టీడీపీ అధినాయకత్వం సిద్ధం కావడంతో ఎమ్మెల్యేలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News