వైసీపీ స్టాండ్ : కేంద్రంతో ఢీ...నో రాజీ !

ఏపీలో పోలవరం ఎత్తుని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఇది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని జగన్ అన్నట్లుగా భోగట్టా.;

Update: 2025-03-06 15:11 GMT

వైసీపీ ఏపీ ప్రయోజనాలనే లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించింది. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద పార్లమెంట్ లో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారని సమాచారం. ఏపీలో పోలవరం ఎత్తుని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఇది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని జగన్ అన్నట్లుగా భోగట్టా.

అదే సమయంలో పోలవరం అసలైన డిజైన్ ని అమలు చేసే విధంగా ఎంపీలు పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని ఆయన కోరారని అంటున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణకు నో చెప్పాలని ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా ఒత్తిడి తేవాలని కూడా జగన్ సూచించారని అంటున్నారు.

డిలిమిటేషన్ వల్ల ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాదిన తగ్గుతాయని వస్తున్న వార్తల పట్ల కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలతో జగన్ చర్చించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం మీద కేంద్రం స్పష్టత ఇచ్చేలా ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు.

నియోజకవర్గాల పునర్ విభజన మీద క్లారిటీ ఉండాల్సిందే అని వైసీపీ అధినేత ఎంపీలకు సూచించారని అంటున్నారు. అదే విధంగా కీలకమైన మరో అంశం ఏపీలో ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగేలా వాటి నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఈ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని కోరారని అంటున్నారు.

ఏపీలో మిర్చీ రైతులకు మద్దతు ధర విషయంలో వైసీపీ పార్లమెంట్ లో ద్వజమెత్తాలని నిర్ణయించింది. వీటితో పాటుగా జమిలి ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరిగేలా కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని ఈ విషయంలో ఎంపీలు డిమాండ్ చేయాలని కోరారని అంటున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కూడా ఇపుడు బ్యాలెట్ పేపర్ విధానం మీదనే ఎన్నికలు పెడుతున్నాయని అదే విధానం దేశంలో ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ప్రయోజనలా విషయంలో కేంద్రం మీద పోరాడాలని ఎక్కడా రాజీపడరాదని జగన్ కోరారని అంటున్నారు. మరి వైసీపీ విధానంలో వచ్చిన ఈ మార్పుతో రేపటి పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా సాగుతాయో చూడాలి. ఏపీలో కూటమి అంతా ఒక్కటిగా ఉంది. దాంతో వైసీపీ తనదైన పోరాటం ఒంటరిగా చేయక తప్పడం లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News