వైసీపీలో 'జగన్ సేన'.. జనసేనకు పోటీగా కొత్త పాలసీ ..!
ఈ క్రమంలో గతంలో వలంటీర్లను నమ్ముకుని చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా.. ఇప్పుడు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీలో కొత్తగా `జగన్ సేన` పేరుతో ప్రత్యేక వింగ్ ఏర్పాటు కానుందా? దీనికి సంబంధించి అంతర్గత చర్చలు జరుగుతున్నా యా? త్వరలోనేకార్యరూపం దాల్చే అవకాశం ఉందా? అంటే.. ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రాథమిక సమాచారం మేరకు.. దెబ్బతిన్న పార్టీని తిరిగి నిలబెట్టేందుకు వైసీపీ అదినేత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వలంటీర్లను నమ్ముకుని చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా.. ఇప్పుడు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి అత్యంత విధేయులను తయారు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు బాగానే ఉన్నారు. కానీ, ఎన్నికల తర్వాత.. ఈ పరిస్థితి మారిపో యింది. ఎక్కడివారు ఎక్కడెక్కడకో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీకి బలమైన పునాదులుగా ఉన్న గ్రామీణ, మహిళా ఓటు బ్యాంకు సహా.. ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు కూడా కుదేలైంది. దీనిని గమనించిన జగన్.. త్వరలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బలమైన విభాగాలకు ఆయన రూపకల్పన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ విధానాలపై కృషి చేస్తారు.
అదేసమయంలో `జగన్ సేన` మాత్రం.. ప్రచారం కోసం విస్తృతంగా కసరత్తు చేసేలా ప్రాధాన్యం ఇస్తున్నారని తాడేపల్లిలో అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇక, ఇదే విషయంపై మాజీ మంత్రుల నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకుంటు న్నారు. జగన్ సేనలో దాదాపు పార్టీ కార్యకర్తలకే ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని.. గతంలో పార్టీ కోసం పనిచేసి ఎలాంటి ప్రాధా న్యం దక్కలేదని భావిస్తున్నవారికి జగన్ సేన ద్వారా సంతృప్తి పరిచే విధంగా ఈ విధానానికి రూపకల్పన చేస్తున్నారు. అదేవిధంగా వీరిని రాటు దేలిన కార్యకర్తలుగా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
జనసేనకు పోటీ?
గతంలో జనసేన పార్టీ.. రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఏర్పాటు చేసింది. అయితే..వారు ప్రజల్లోకి నేరుగా వెళ్లకపోయినా.. సామాజిక మాధ్యమాల ద్వారా.. సామాజిక వర్గాల పరంగా పార్టీని ప్రభావితం చేశారు. అయితే.. వీరికి పోటీగా ఇప్పుడు జగన్ సేనను తీసుకురావడం ద్వారా ప్రజల్లో పార్టీకి గత వైభవాన్ని తీసుకురావాలన్నది వైసీపీ వ్యూహంగాఉంది. తొలుత ఈ ప్రయోగాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రారంభించేందుకు అవకాశం ఉందని.. దీనిపై కొన్నిరోజుల్లోనే క్లారిటీ వస్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్పడం గమనార్హం.