బీజేపీకి బాధ్యత లేదా? బడ్జెట్ వేళ ఏం చేస్తారో?
ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబు ఇప్పటికే ఒక సారి ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు ఇచ్చి వచ్చారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన.. బీజేపీ ఒకమంత్రి పదవిని కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్‌కు చంద్రబాబు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేటాయించారు. ఇక, టీడీపీ-జనసేనలతో జత కట్టిన నేపథ్యంలో బీజేపీ ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబు ఇప్పటికే ఒక సారి ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు ఇచ్చి వచ్చారు.
ఇప్పుడు(మంగళవారం) మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున కూడా.. కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలనే సూచనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఏమేమేం అవసరమో.. ఎంతెంత నిధులు కావాలో.. బీజేపీ కి కూడా తెలుసు కాబట్టి ఆదిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు.
వారు కూడా.. పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి సంబంధించిన నిధుల వ్యవహారాన్ని లేవనెత్తడంతోపాటు.. బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ వారు కొన్ని సూచనలు చేసి.. ఏపీకి వచ్చే నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించడమో.. బ్రతిమాలడమో చేయాలన్న సూచనలు కూటమి పార్టీల నుంచే వినిపిస్తున్నాయి. వారు కూడా రాష్ట్రంలో ఎదగాలని భావిస్తున్న నేపథ్యంలో మౌనంగా ఉంటే సరికాదని.. అంతా చంద్రబాబుపై భారం వేసి చూస్తూ.. కూర్చుంటే ఎలా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కానీ.. ఎంపీలు కానీ.. ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ వారంలో అయినా.. కదలిక ఉంటుందేమో చూడాలి.