రేవంత్‌కు టాస్క్‌.. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఎవ‌రికో చోటు?

ఈ స‌మాచారం తెలుసుకున్న పార్టీ ఎమ్మెల్యేలు త‌మ ప్ర‌య్న‌తాల‌ను మొద‌లెట్టిన‌ట్లు టాక్‌.

Update: 2024-06-14 07:46 GMT

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు అందించేందుకు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు మ‌రో టాస్క్‌. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 8 సీట్లు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. దీంతో డ‌బుల్ డిజిట్ సీట్ల‌ను గెలుచుకోలేక‌పోయిన కాంగ్రెస్ రేవంత్‌పై కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ఎన్నిక‌ల హ‌డావుడి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ రేవంత్ ఇక ప్ర‌భుత్వంపై, రాష్ట్రంలో పార్టీపై ఫోక‌స్ పెట్టారు. త్వ‌ర‌లోనే ఆయ‌న కేబినెట్‌ను విస్త‌రించే అవ‌కాశం ఉంది. ఈ స‌మాచారం తెలుసుకున్న పార్టీ ఎమ్మెల్యేలు త‌మ ప్ర‌య్న‌తాల‌ను మొద‌లెట్టిన‌ట్లు టాక్‌.

తెలంగాణ మంత్రివ‌ర్గంలో త్వ‌ర‌లోనే మార్పులు, చేర్పులు ఉండే అవ‌కాశం ఉంది. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు పూర్తి చేశార‌ని తెలిసింది. మ‌రోవైపు కేబినెట్ విస్త‌ర‌ణకు కాంగ్రెస్ హైక‌మాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత ఏర్ప‌డ్డ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రేవంత్‌తో స‌హా 12 మందితో మంత్రివ‌ర్గం ఏర్ప‌డింది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆరు స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌కు మంత్రివ‌ర్గ కూర్పులో ప్రాధాన్యం ఉంటుంద‌ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆగ‌స్టు 15 లోపు పూర్తిస్థాయి కేబినెట్‌ను సిద్ధం చేసుకోవాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే మంత్రి ప‌ద‌విపై చాలా మంది నేత‌లే ఆశ పెట్టుకున్నారు. ఇప్ప‌టికే ప‌ద‌వి కోసం ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాల‌నూ మొద‌లెట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వి ఎవ‌రికివ్వాల‌న్న‌ది రేవంత్‌కు పెద్ద టాస్క్‌గా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి న‌లుగురు, ఎస్సీ, బీసీ సామాజిక వ‌ర్గాల నుంచి ఇద్ద‌రు, ఎస్టీ, క‌మ్మ‌, వెల‌మ సామాజిక వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రు చొప్పున కేబినెట్‌లో ఉన్నారు. కొత్త‌గా మైనారిటీల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని రేవంత్ చూస్తున్న‌ట్లు తెలిసింది. ఒక‌రిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి ప‌ద‌వి ఇచ్చే ఆస్కార‌ముంది. ఇక ముదిరాజ్ వ‌ర్గం నుంచి కూడా ఒక‌రికి కేబినెట్‌లో చోటు ద‌క్కే ఛాన్స్ ఉంది. మ‌రోవైపు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు కాకుండా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్న వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌న్న‌ది హైక‌మాండ్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

Tags:    

Similar News