జగన్ కోసం రంగంలోకి ఆర్.ఎస్.పీ... తెరపైకి కీలక డిమాండ్!

ఇందులో భాగంగా ప్రధానంగా అక్రమ కట్టడాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Update: 2024-07-13 12:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు వ్యవహారాలపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా అక్రమ కట్టడాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కనపెట్టడం, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపైనా కేసులు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రధానంగా తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు మీద ఎఫ్.ఐ.ఆర్. నమోదయ్యింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో వీరితో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పైనా ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆరెస్స్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు.

అవును... గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజును వేధించారనే ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు మీద తాజాగా ఎఫ్.ఐ.అర్. నమోదు చేసిన సంగతి తెల్లిసిందే. ఈ వ్యవహారంపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... ముడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం కేవలం ప్రతీకార రాజకీయ చర్యలాగే అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ ఘటన జరిగి, ఇప్పటి వరకూ జరిగింది ప్రభుత్వం మారడం తప్ప మరేమీ లేదని.. అప్పట్లోనే ఈ వ్యవహారం కోర్టు విచారన జరిపితేనే ఏమీ బయటకు రాలేదని అన్నారు.

ఈ సందర్భంగా రాజకీయ నాయకుల కక్ష సాధింపు చర్యలకు అధికారులు బలవుతున్నారని.. నిజాయితీ గల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాలలో బాధితులుగా మారుతున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సీనియర్ పోలీస్ అధికారులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా... గోద్రా మారణ హోమంలో సత్యానికీ, న్యాయానికీ అండగా నిలిచిన కారణంగా గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న విషయాన్ని ప్రస్థావించారు! అనంతరం ట్రిపుల్ ఆర్ పై స్పందించిన ఆర్.ఎస్.పీ... 2021లో పార్లమెంట్ లో సదరు రాజకీయ నాయకుడు నిరాధారమైన ఆరోపణలు చేశారని, మళ్లీ ఎమ్మెల్యే ఎలా అయ్యారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు సీనియర్ ఐపీఎస్ అధికారులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకొవాలని ఈ సందర్భంగా ఆర్.ఎస్.పీ. కోరారు. దీంతో... ఏపీ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు వైఎస్ జగన్ పై పెట్టిన కేసులపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉండి ఉంటారని, ఆర్.ఎస్.పీని కేసీఆరే రంగంలోకి దించి ఉంటారని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News