భూగర్భంలో హెబ్బొల్లా చీఫ్.. బతికాడా? పోయాడా? కుమార్తె బలి
మొన్న లెబనాన్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఇప్పుడు భయంకర ఉగ్ర సంస్థ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా పైనే గురిపెట్టాయి.
మొన్న లెబనాన్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఇప్పుడు భయంకర ఉగ్ర సంస్థ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా పైనే గురిపెట్టాయి. దీంతో పెద్దఎత్తున దాడులు జరుపుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో దాడులకు దిగిన దక్షిణ లెబనాన్ దాహియాలోని ఇళ్ల కింద భూగర్భంలో ఉన్న డెన్ లో దాక్కున్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై భయంకరమైన బాంబులను ప్రయోగించాయి. ఇందులో నస్రల్లా చనిపోయాడా? సురక్షితంగానే ఉన్నాడా? అన్నది స్పష్టం కాలేదు.
లెబనాన్ పై భీకరంగా..
సోమవారం నుంచి హెబ్బొల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం లెబనాన్ పై భీకరంగా విరుచుకుపడింది. రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతం హెచ్‌బొల్లాల అడ్డా. దీంతో వాటిపై వైమానిక దాడులకు దిగింది. ఈ క్రమంలోనే హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా కుమార్తె జైనబ్ చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. శత్రువును ఆత్మరక్షణలో పడేసేందుకే ఇజ్రాయెల్ ఇలా చేస్తున్నదా? అనే అనుమానాలున్నాయి. కాగా, జైనబ్ మృతిని హెజ్బొల్లా, లెబనాన్ ధ్రువీకరించలేదు.
నస్రుల్లా సంగతేంటి?
నస్రుల్లా మరణంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ఇదే నిజమైతే హెజ్బొల్లాకు పెద్ద దెబ్బనే. ఇజ్రాయెల్ కూడా ఈ విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెబుతోంది. తమ దాడుల తీవ్రతకు అతడు బతికి బట్ట కట్టే అవకాశాలు లేవని అంటోంది. హోజ్జొల్లా వర్గాలు మాత్రం నస్రుల్లా బతికే ఉన్నాడని పేర్కొంటున్నాయి. ఇంతకూ నస్రుల్లా ఎక్కడ ఉన్నదీ తెలియరాలేదు. అతడితో సమాచార సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. కాగా, బీరుట్ లో దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ పై 65 రాకెట్లు ప్రయోగించింది. ప్రతిగా దాని స్థావరాలపైకి యాంటీ-షిప్ క్షిపణులతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్ లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది.
ఎవరీ జైనబ్?
నస్రుల్లా కుమార్తె జైనబ్ హెజ్‌బొల్లాలో కీలక పాత్రధారి. 1997లో ఇజ్రాయెల్ దాడుల్లో నస్రుల్లా కుమారుడు హదీ చనిపోయాడు. తన కుటుంబం త్యాగాలు, హెజ్బొల్లా లక్ష్యాలను జైనబ్ గట్టిగా మాట్లాడుతుంది. దీంతో ఆమె మీడియాలో ప్రముఖంగా నిలిచింది. జైనబ్ మరణించడం నిజమైతే ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడం ఖాయం. హెజ్బొల్లా విరుచుకుపడుతుందని చెబుతున్నారు.