గాజా సొరంగాల్లో బందీలు... ఇజ్రాయేల్ సంచలన నిర్ణయం!

హమాస్‌ పై ఇప్పటికే యుద్ధం ప్రకటించి.. వారు పెద్ద తప్పు చేశారని ప్రకటించిన ఇజ్రాయెల్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది.

Update: 2023-10-09 15:17 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయేల్ పై హమాస్ చేస్తున్న దాడులే హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈ సమయంలో పాత సినిమాల్లో లాగానే... బందీలను దాచిపెట్టడం, అనంతరం వారి కేంద్రంగానే బేరసారాలు సాగించడం వంటి ఆలోచననే హమాస్ ఉగ్రవాదులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో వారు బందీలను దాచిపెట్టిన విధానం, ఆ స్థలాలూ ఇప్పుడు ఇజ్రాయేల్ సైన్యానికి పెనుసవాలుగా మారినట్లు తెలుస్తుంది.

అవును... ఇజ్రాయెల్‌ నుంచి అపహరించిన బందీలను హమాస్‌ ఉగ్రవాదులు ఇప్పటికే గాజా నగరంలోని భూమి కింద రహస్య ప్రాంతాలకు తరలించి ఉంటారనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. గాజా నగరం నడిబొడ్డున ఉన్నట్లు చెబుతున్న టన్నెల్‌ నెట్‌ వర్క్‌ అత్యంత ప్రమాదకరమైందని.. హమాస్‌ ఆధీనంలో ఉన్న బందీలను రక్షించడం ఇప్పుడు ఇజ్రాయెల్‌ దళాల ముందున్న తక్షణ కర్తవ్యం అని.. అయితే అది అంత సులువు కాదని చెబుతున్నారు.

2001లో పాలస్తీనా వాసులు ఇజ్రాయెల్‌ పోస్టులను ధ్వంసం చేయడానికి సొరంగాలను ఉపయోగించేవారు. అనంతరం 2006లో గాజా - ఇజ్రాయెల్‌ సరిహద్దులో ఓ సొరంగం తవ్వి.. ఆ మార్గంలో ఓ హంతక ముఠా ఇజ్రాయెల్‌ వెళ్లి ఇద్దరు సైనికులను హత్య చేసి ఒకరిని కిడ్నాప్‌ చేసింది. ఈ క్రమంలో 2011 ఖైదీల మార్పిడి ఒప్పందం సందర్భంగా అతడిని విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో గాజాలో ఉన్న సొరంగాలపై అప్పట్లో విపరీతమైన చర్చ జరిగింది. హమాస్‌ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి.. గాజా లో కాంక్రీట్‌ వినియోగించి అండర్‌ గ్రౌండ్‌ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాలతో అనుసంధానించారని తెలుస్తుంది. దీనికోసం బాలకార్మికులను వాడారని అంటున్నారు. వీటిని యుద్ధ విమానాలు, ఉపగ్రహాలకు దొరక్కుండా కేమోఫ్లాజ్‌ టెక్నిక్‌ తో కప్పిపెడతారట.

ఈ సొరంగాల్లో నీరు, విద్యుత్తు, ఆయుధాలు అందుబాటులో ఉంటాయట. ఈజిప్ట్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌ కు కూడా వీటిని వాడతారట. ఒక అంచనా ప్రకారం... గాజా పట్టణంలో సుమారు 1,300 వందలకు పైగా సొరంగాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే... ఈ సొరంగాలకు వాడిన మెటీరియల్‌ మొత్తం ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిందే కావడం విశేషం.

ఇక ఈ సొరంగాలకు చెందిన ప్రవేశ మార్గాలన్నీ సామాన్య ప్రజానికం ఎక్కువగా తిరిగే మార్కెట్ వీదులు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలు, పాఠశాల పరిశరాల్లోనే ఉండటం గమనార్హం. వీటిలో కొన్ని సొరంగాలు 65 అడుగుల కింద ఉండటంతో వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యం అని చెబుతారు.

ఈ సమయంలో తాజాగా బందించిన వారిని ఆ సొరంగాల్లోనే దాచి ఉంచినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 100 మందికిపైగా సామాన్య ప్రజానికం హమాస్‌ చెరకు చిక్కడం.. వీరిలో విదేశీయులు కూడా ఉండటంతో ఇజ్రాయెల్‌ పై తీవ్ర ఒత్తిడి నెలకొందని అంటున్నారు. దీంతో తాజాగా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. అయితే వీరిని ప్రాణాలతో కాపాడుకోవడం హామాస్ కు అత్యంత కీలకం. కారణం... వీరు బ్రతికుంటేనే హమాస్ పెట్టే కండిషన్స్ కి ఇజ్రయేల్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది.

గాజాను సీజ్ చేసిన ఇజ్రాయేల్:

హమాస్‌ పై ఇప్పటికే యుద్ధం ప్రకటించి.. వారు పెద్ద తప్పు చేశారని ప్రకటించిన ఇజ్రాయెల్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా... గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరాలను కట్‌ చేసింది. విద్యుత్తు, ఆహారం, నీరు అందకుండా చర్యలు చేపట్టింది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవో గల్లాంట్‌... "మేము మానవ మృగాలతో పోరాడుతున్నాం.. దానికి తగ్గట్లే మా పోరాటం ఉంటుంది" అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే... నీరు, ఆహారం, విద్యుత్ లను అందకుండా చేస్తున్నట్లు తెలిపారు!

Tags:    

Similar News