ఇజ్రాయెల్ కేన్సర్ గడ్డ.. ఇరాన్ అణ్వస్త్ర భూతం.. పాము-ముంగిస పోరు
45 ఏళ్ల కిందట వరకు ఆ రెండు దేశాలు మిత్రులే.. కానీ, కాలంతో పాటు పరిస్థితులు మారాయి
45 ఏళ్ల కిందట వరకు ఆ రెండు దేశాలు మిత్రులే.. కానీ, కాలంతో పాటు పరిస్థితులు మారాయి. ఒకటి ప్రజాస్వామ్య దేశంగానే మిగలగా.. మరొకటి మత రాజ్యంగా మారింది. ఒకటి అత్యంత బలమైన దేశంగా ఎదగగా.. మరొకటి తనదైన శైలిలో ముందుకెళ్లి వివాదాస్పద దేశంగా మిగిలింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కయ్యం మొదలైంది.
చరిత్రలో తొలిసారి..
సిరియా రాజధాని దమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై రెండు వారాల కిందట వైమానిక దాడిలో ఇద్దరు సైనిక జనరళ్ల సహా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ నకు చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇది ఇజ్రాయెల్ పనేనని ఆరోపించింది ప్రతీకారంగా గత ఆదివారం ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. అయితే, ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై దాడికి దిగడం ఇదే తొలిసారి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇక్కడో విషయం ఏమంటే.. ఇజ్రాయెల్ ఏనాడూ డమాస్కస్ దాడులకు కారణం తామేనని ప్రకటించలేదు. కానీ ఇరాన్, మరికొన్ని వర్గాలు మాత్రం దాడుల వెనుక ఆ దేశం ఉందని నమ్ముతున్నాయి. గతంలోనూ ఇరాన్-ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి పరోక్ష యుద్ధం కొనసాగించాయి. పరస్పర లక్ష్యాలపై దాడులు చేసుకున్నా.. వీటికి బాధ్యత వహించలేదు.
ఒకప్పటి మిత్రులే
ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రదేశాలే. అయితే ,1979లో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ వ్యతిరేకత కలిగిన పాలకులు అధికారంలోకి వచ్చారు. ఆ దేశ ఉనికినే గుర్తించకపోగా.. సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనకు వచ్చారు. ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ అయితే ఇజ్రాయెల్ ను కేన్సర్ గడ్డగా అభివర్ణించారు. ఇక తన అస్తిత్వానికి ఇరాన్ ముప్పు అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. ఆ దేశం చేసే ప్రకటనలు, ఇజ్రాయెల్ విధ్వంసానికి కట్టుబడిన దళాల ఏర్పాటు, హమాస్ సహా పాలస్తీనా గ్రూపులు, లెబనాన్ లోని షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతోందని, అణుబాంబు తయారీలో ఉందని నమ్ముతోంది.
సైనిక శక్తిలో ఎవరెక్కడ..?
ఇరాన్ భౌగోళికంగా ఇజ్రాయెల్ కంటే పెద్దది. దీని 9 కోట్ల జనాభా.. ఇజ్రాయెల్ జనాభా కంటే పదింతలు. క్షిపణులు, డ్రోన్లపై ఇరాన్ భారీగా ఖర్చు చేస్తోంది. తనవద్ద భారీగా ఉన్న ఆయుధాలను యెమెన్ లోని హౌతీలకు, లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూపులకు సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకూ షహీద్ క్షిపణులను అందిస్తోంది. కానీ, ఆధునిక రక్షణ వ్యవస్థ, యుద్ధ విమానాలు మాత్రం ఇరాన్ కు లేవు. రష్యా సాయంతో ఆయుధ సంపత్తిని ఆధునికీకరించుకునేందుకు చూస్తోంది.
సైనిక శక్తి ఇజ్రాయెల్
చిన్న దేశమే అయినా..ఇజ్రాయెల్ కు ప్రపంచంలోనే అధునాతన వైమానిక దళం ఉంది. ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-35 స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ సహా కనీసం 14 ఎయిర్‌క్రాఫ్ట్ స్వ్రాడ్రన్స్ ఉన్నాయి. అవసరమైతే శత్రువుల భూభాగంలో దాడులు చేయగల సత్తా ఇజ్రాయెల్ సొంతం.
ఇద్దరి వద్దా అణ్వాయుధాలు..?
సైనికంగానే కాక, సాంకేతికంగానూ బలమైన ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు. కానీ, అంతా రహస్యం. ఇరాన్ పై ఎప్పటినుంచో అణ్వాయుధాలు తయారు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, దీనిని ఆ దేశం ఖండిస్తోంది. అయితే,
ఇరాన్ భూగర్భంలో యురేనియం అణువులు 83.7 శాతం స్వచ్ఛతకు చేరుకున్నాయని, ఇవి అణ్వాయుధాల తయారీకి కావాల్సిన నాణ్యతకు చాలా దగ్గరగా వచ్చాయని నిరుడు గ్లోబల్ న్యూక్లియర్ వాచ్‌డాగ్ తెలిపింది. 2015 అణ్యాయుధ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ బహిరంగంగానే రెండేళ్ళుగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 60 శాతం స్వచ్ఛతను సాధించడం గమనార్హం.