'ఆర్టిఫీషియల్ వరల్డ్'.. ఉగ్ర సంస్థ చుట్టూ సాలె గూడులా ఇజ్రాయెల్ ఉచ్చు

దాన్నుంచి హీరో కోసం కావాల్సినంత వినోదం పండిస్తారు మిగతా క్యారెక్టర్లు.

Update: 2024-12-23 15:30 GMT

మూడు దశాబ్దాల కిందట వచ్చిన ఓ తెలుగు సినిమాలో ఓ క్యారెక్టర్ చుట్టూ కృత్రిమ ప్రపంచాన్ని సృష్టిస్తారు. దాన్నుంచి హీరో కోసం కావాల్సినంత వినోదం పండిస్తారు మిగతా క్యారెక్టర్లు.

ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అలానే చేసింది. తమ కంట్లో నలుసులా మారిన ఉగ్రవాద సంస్థ చుట్టూ సాలె గూడులాంటి ఉచ్చును పన్నింది. సరైన సమయం చూసి దానిని ‘పేల్చేసింది’.

సెప్టెంబరులో లెబనాన్ లో హెజ్బొల్లా మిలిటెంట్లు, సానుభూతిపరుల జేబుల్లోని పేజర్లు పటపటామని పేలిపోయాయి. మరణాలు తక్కువే.. కానీ, గాయపడింది మాత్రం చాలామంది. దీనికి కారణం ఏమిటో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. అప్పటికే సరిగ్గా ఏడాది నుంచి హమాస్ ఉగ్ర సంస్థతో యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. అలాంటిది ఒక్కసారిగా హెజ్బొల్లాను ప్లాన్ ఎందుకు చేసింది..?

పదేళ్ల కిందటి ప్రణాళిక

హెజ్బొల్లా ఇరాన్ మద్దతున్న సంస్థ. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తూ హమాస్ కు మద్దతు అందిస్తూ ఉంటుంది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో హమాస్ కు సాయం చేస్తోంది. ఈ క్రమంలో హెజ్బొల్లాలు ఇజ్రాయెల్ ను నేరుగా టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. అందుకనే వారి అంతు చూసేందుకు పదేళ్ల కిందటే ఇజ్రాయెల్ పన్నాగం వేసిందట. ఆ మిలిటెంట్ల చుట్టూ కృత్రిమ ప్రపంచాన్నే సృష్టించిందట.

పేజర్లు భద్రం అనుకుంటే..

మారుతున్న సాంకేతికతతో సెల్ ఫోన్ల వాడకం క్షేమం కాదని.. పాత టెక్నాలజీ అయిన పేజర్లు, వాకీటాకీల వైపు మొగ్గచూపారు హెజ్బల్లాలు. కానీ, వాటినే టార్గెట్ చేసి కొట్టింది ఇజ్రాయెల్.

పేలుడు పదార్థాలు నింపిన వాకీటాకీలను హెజ్‌బొల్లా కేడర్‌ లోకి చొప్పించింది. దీనికి 10 ఏళ్ల కిందటే ఊపిరి పోసిందట. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమంటే తాము కొనేది ఇజ్రాయెలీ వాకీటాకీలను అనే సంగతి మిలిటెంట్లకు తెలియకపోవడం.

ఇలానే పేలుడు పదార్థాలను పెట్టిన పేజర్లనూ సరఫరా చేసింది. అయితే, ఇది 2022 నుంచి మాత్రమే. తైవాన్‌ సంస్థ నుంచి పేజర్ల కొనుగోలుకు హెజ్బొల్లాలు నిర్ణయించగానే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌ అప్రమత్తమైంది. తగిన మొత్తంలో పేలుడు పదార్థాలు అమర్చేలా పేజెర్ల సైజును కొద్దిగా పెద్దగా ఉండేలా చేసింది. హెజ్‌బొల్లా ఫైటర్‌ ను మాత్రమే గాయపర్చేలా డమ్మీలను పరీక్షించింది. ఎలాంటి రింగ్‌ టోన్‌ మోగితే తక్షణమే దానిని జేబులోంచి తీసి లిఫ్ట్‌ చేస్తారనే దానిపైనా ప్రయోగాలు చేయడం గమనార్హం.

అడ్వర్టయిజ్ మెంట్లు ఇచ్చి..

ఏ వస్తువునైనా ఎవరైనా ఊరికే ఎందుకు కొంటారు...? అందుకే ఆకర్షణీయమైన ప్రకటనలు ఇప్పించింది ఇజ్రాయెల్. హెజ్‌బొల్లా తో పేజర్లను కొనేందుకు ఒప్పించేలా యూట్యూబ్‌లో అడ్వర్టయిజ్ మెంట్లు ఇచ్చింది. హంగేరీలో డమ్మీ కంపెనీని ప్రారంభించి.. తైవాన్‌ సంస్థ గోల్డ్‌ అపోలోతో ఒప్పందం చేసుకొంది. ఏమాత్రం అనుమానం రాకుండా ఇదంతా చేసింది. ‘ట్రూమన్‌ షో’ అనే 1998లో విడుదలైన సైకలాజికల్‌ డ్రామా సినిమాలో వ్యక్తి చుట్టూ పూర్తిగా కృత్రిమ ప్రపంచం సృష్టిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇలానే చేసింది.

పేలుళ్లు జరిగిన సెప్టెంబరు నాటికి హెజ్‌బొల్లా దళాల జేబుల్లోకి 5 వేల పేజర్లు చేరాయి. సెప్టెంబరు 17న ఒక్కసారిగా పేలడం మొదలుపెట్టాయి. వాటిని పేల్చేందుకు వాడిన ఎన్‌క్రిప్టెడ్‌ సందేశం వచ్చిన వేళ.. దానిని చదివేందుకు యత్నించకపోయినా సరే అవి పేలేటట్లు పేజర్లను డిజైన్‌ చేశారు.

ఇజ్రాయెల్‌.. పేజర్ల మృతుల అంత్యక్రియల్లో వాకీటాకీలను పేల్చింది. అయితే, ఈ పేలుళ్లలో మరణాలు తక్కువే. క్షతగాత్రులు, గాయపడిన వారు ఎక్కువ. వారంతా అలా గాయపడి తిరగడం తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నిదర్శనంగా చూపేందుకే పేలుళ్లకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. దీని తర్వాత ఇజ్రాయెల్‌ నేరుగా లెబనాన్ పై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టింది.

కొసమెరుపు: పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌ లో ఏసీలు వాడేందుకు కూడా ప్రజలు భయపడ్డారట.

Tags:    

Similar News