ఇస్రో "అనలాగ్ మిషన్" స్టార్ట్... లడఖ్ లోనే ఎందుకో తెలుసా?
అంతరిక్షంలో ఉండే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక ప్రదేశాలు వ్యోమగాములకు అలవాటు పడటానికే ఈ పని!
చంద్రయాన్ 3 సక్సెస్ తో ప్రపంచ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత్... త్వరలో గగన్ యాన్ ప్రాజెక్ట్ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కీలకమైన అనలాగ్ మిషన్ కు లడఖ్ లోని లేహ్ ను ఎంచుకొంది ఇస్రో. అంతరిక్షంలో ఉండే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక ప్రదేశాలు వ్యోమగాములకు అలవాటు పడటానికే ఈ పని!
అవును... అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష యాత్రకు సంబంధించి చేపట్టే ఫీల్డ్ టెస్టులను "అనలాగ్ మిషన్" అంటారు. ఈ నేపథ్యంలో ఇస్రో తన అనలాగ్ మిషన్ కు లడఖ్ ను ఎంచుకొంది. దీనిలో ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు పలు పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తాయి. అంతరిక్ష యాత్ర సన్నద్ధతను విశ్లేషిస్తాయి.
ఇందులో భాగంగా... రోబోటిక్ పరికరాలు, ప్రత్యేకమైన వాహనాలు, కొత్త టెక్నాలజీ, విద్యుత్ తయారీ, కమ్యునికేషన్స్ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తారని నాసా వెబ్ సైట్ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలక భాగంగా... స్పేస్ రేడియేషన్ ను అంచనా వేయడంగా చెబుతారు.
ఈ నేపథ్యంలో తాజా మిషన్ లో ఈ విశ్లేషణల కోసం ఇస్రో తో పాటు.. అకా స్పేస్ స్టూడియో, ఐఐటీ బాంబే, ది యూనివర్సిటీ ఆఫ్ లడఖ్, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లు చేతులు కలిపాయి. ఇక్కడ ఇతర గ్రహాల పరిస్థితులను అంచనా వేస్తూ.. వ్యోమగాములు నివాసం ఉండటానికి తగిన ఏర్పాట్లను అభివృద్ధి చేయనున్నట్లు చెబుతున్నారు.
దీంతోపాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లే వనరులను ఎలా వాడుకోవాలో ఇక్కడ ప్లాన్ చేస్తారు. రాబోయే రోజుల్లో అంగారకుడు, చంద్రుడిపైకి మానవ సహిత యాత్రలు చేయడానికి ఇది ప్రయోజనకరంగా మారనుందని చెబుతున్నారు!
లడఖ్ లోనే ఎందుకు?:
చంద్రుడు, అంగారక గ్రహం లాంటి కఠిన భౌగోళిక పరిస్థితులున్న ప్రదేశంలో ఈ ప్రాజెక్ట్ చేపడితే విశ్లేషణ సులువవుతుందని అంటుంటారు!! ఈ నేపథ్యంలో.. అలాంటి పరిస్థితులు ఉన్న ప్రదేశాన్ని లడఖ్ లో గుర్తించారంట. ఇది ఎత్తైన పర్వత ప్రదేశం కావడంతో పాటు.. ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలను చూపడం వల్ల స్పెస్ మిషన్ ల వ్యూహాల తయారీకి దీన్ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు!