ఐటీ రిటర్న్ లేట్ అయితే రిఫండ్ రాదా? ఐటీ శాఖ ఏమంటోంది?
ఈ తరహా సందేహాలపై మరింత పీటముడులు పడేలా.. అరకొర అవగాహనతో చేసే వ్యాఖ్యలు కొత్త గందరగోళానికి గురయ్యేలా చేస్తుంటాయి.
సోషల్ మీడియా విస్త్రతి పెరిగిన తర్వాత నుంచి తప్పుడు ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరో ఏదో పోస్టు పెట్టటం.. అది కాస్తా వైరల్ కావటం.. ప్రజల్లో పెరిగే ఆందోళనకు చెక్ పెట్టేలా వివరణ ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా ఇదే తరహాలో ఒక ప్రచారం మొదలైంది. ఆదాయపన్ను రిటర్న్స్ ను దాఖలు చేసే విషయంలో కొత్త ఆదాయపన్ను బిల్లులో కొత్త అంశాల్ని చేర్చారని.. దీని ద్వారా ఐటీ రిటర్న్ దాఖలు ఆలస్యమైతే.. రిఫండ్ రాదన్నది సారాంశం. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ తరహా సందేహాలపై మరింత పీటముడులు పడేలా.. అరకొర అవగాహనతో చేసే వ్యాఖ్యలు కొత్త గందరగోళానికి గురయ్యేలా చేస్తుంటాయి. తాజాగా దీనిపై ఐటీ శాఖ స్పష్టతను ఇచ్చింది. వ్యక్తిగత ఆదాయపన్నుచెల్లింపుదారులు ఎప్పటిలానే జులై 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఆలస్యమైన పక్షంలో జరిమానాతో డిసెంబరు 31 వరకు రిటర్నులు దాఖలు చేసే వీలు ఉంటుంది.
రిటర్ను దాఖలు చేసే విషయంలో ఎప్పుడూ చేసినా.. రిఫండ్ తిరిగి రావన్న ప్రచారంలో నిజం లేదంటూ ఐటీ శాఖ స్పష్టం చేసింది. కొత్త ఆదాయపన్ను బిల్లులోని క్లాజ్ 263(1) (ఎ)(9) ప్రకారం పన్ను చెల్లింపుదారుడు నిర్దేశిత గడువులోపు రిటర్నులు దాఖలు చేస్తేనే రిఫండ్ కోరగలడని చెబుతోందని.. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసినా రిఫండ్ కు అర్హుడేనని గుర్తు చేసింది. ఏదైనా కారణంతో నిర్ణీత సమయంలో పన్ను చెల్లించటంలో ఫెయిల్ అయితే పన్ను చెల్లింపుదారులకు తాజా నిబంధన కష్టంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పలువురు పన్ను నిపుణులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు.. అనుమానాలు.. ఆందోళనల నేపథ్యంలో ఐటీ శాఖ పూర్తి స్పష్టతను ఇచ్చింది.కొత్త ఆదాయపన్ను బిల్లులో రిఫండ్ కు సంబంధించి ఎలాంటి నిబంధనలూ మార్పులు చేయలేదని పేర్కొంది. ఒకవేళ ఆలస్యంగా రిటర్ను దాఖలు చేసినా.. రిఫండ్ కు అర్హులేనని పేర్కొంది. కొత్తగా ప్రవేశ పెట్టిన ఆదాయపన్ను బిల్లు ఉభయ సభల ఆమోదం పొంది.. రాష్ట్రపతి సంతకం చేస్తే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.