వైసీపీకి దూరంగా ఆ నలుగురూ...షాకింగ్ గురూ !

ఇక అధినాయకత్వం విషయంలో మార్పు ఏమైనా వస్తుందా అంటే అది కూడా నిరాశగా ఉంది అని అంటున్నారు.

Update: 2024-10-21 12:21 GMT

వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తోంది. అధికారాంతమున పార్టీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వెలుగు లేదు మొత్తం చీకటి ఉంది. పార్టీకి ఆశా కిరణం కూడా కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. ఇక అధినాయకత్వం విషయంలో మార్పు ఏమైనా వస్తుందా అంటే అది కూడా నిరాశగా ఉంది అని అంటున్నారు.

అంతా నా ఇష్టం అన్న పోకడలతోనే హై కమాండ్ ఉంది. దాంతో వైసీపీలో కొనసాగడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడం సో బెటర్ అని సీనియర్లు పలువురు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వారంతా వైసీపీలో బిగ్ షాట్స్. అంతే కాదు వారు సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్న వారు.

వైసీపీకి కొమ్ము కాసిన వారు. వారు దిగ్గజ నేతలు. మరి అలాంటి వారిలో ఈ రాజకీయ వైరాగ్యం ఎందుకు వచ్చింది అన్నదే చర్చగా ఉంది. దానికి కారణం పార్టీ ఓటమే కాదు ఓటమి తరువాత కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలు అని అంటున్నారు. ఇక చూసుకుంటే కనుక శ్రీకాకుళం నుంచి సీమ దాకా వైసీపీలో ఇక ఉండలేమని అంటున్న వారి జాబితాలో ఈ నలుగురూ కూడా ఉన్నారని అంటున్నారు.

ఆ నలుగురే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, గుంటూరు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వీరితో పాటు జగన్ కి అత్యంత ఆప్తుడుగా పేరు పొందిన కడప జిల్లా నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అని అంటున్నారు.

అయితే వీరు లేటు వయసులో పార్టీ గోడ దూకడానికి అయితే సిద్ధంగా లేరని అంటున్నారు. తమ పొలిటికల్ ఇమేజ్ ని అలా వీరు ఫణంగా పెట్టడానికి సిద్ధంగా లేరు అని అంటున్నారు. అందుకే తమ అస్త్రాలను పక్కన పడేసి గమ్మున ఉండాలని చూస్తున్నారుట. ఇక రాజకీయాలకు ఒక పెద్ద నమస్కారం అని చెప్పబోతున్నారు అని అంటున్నారు.

ముందుగా ధర్మాన ప్రసాదరావుని తీసుకుంటే ఆయన కాంగ్రెస్ లో రాజకీయం మొదలెట్టారు, వైసీపీలోకి వచ్చారు. ఇక ఇపుడు మళ్ళీ పార్టీ మారాలి అన్న ఆసక్తి అయితే ఆయనకు లేదు. కానీ ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడిని చూడాలని అనుకుంటున్నారు. దాంతో తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు జనసేనలోకి వెళ్తాను అంటే ఆయన ఓకే అనేశారని, తాను మాత్రం రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.

అలాగే ముద్రగడ పద్మనాభం విషయానికి వస్తే ఆయన రాజకీయంగా విసిగిపోయి ఉన్నారని అంటున్నారు. ఆయన బలమైన సామాజికవర్గం దన్నుతో గతంలో ఉద్యమాలు చేసినా ఇపుడు పరిస్థితి మారింది. దాంతో ఆయన కూడా వైసీపీలో చేరినా కూడా మౌనముద్ర దాలుస్తున్నారు. ఎందుకొచ్చిన రాజకీయం అన్న వేదాంత భావనలో పడ్డారు అని అంటున్నారు. అందుకే కిర్లంపూడి ప్రాంతం అంతా గప్ చుప్ గా ఉందని అంటున్నారు.

ఇక ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు టీడీపీలో సీనియర్ నేతగా కేంద్రంలో ఒకసారి సహాయ మంత్రిగా పనిచేసిన వారు. వైసీపీ పుట్టినప్పటి నుంది అందులోనే ఉంటూ తన అనుభవాన్ని అందించిన వారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అల్లుడు కిలారి రోశయ్య జనసేనలో చేరిపోయారు. దాంతో ఉమ్మారెడ్డి మీద వైసీపీలో ఒత్తిడి బాగా పెరిగింది అని అంటున్నారు. ఈ వృద్ధాప్యంలో ఇవన్నీ అవసరమా అని భావించిన పెద్దాయన రాజకీయాలకు రాం రాం అని అంటున్నారుట.

ఇక రాయలసీమలో చూస్తే కనుక కడప జిల్లాకు చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్ కి మంచి సన్నిహితుడు. పార్టీ కోసం కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బయటకు వచ్చిన వారు. ఇంత చేసినా నాటి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల మీద ఎంత పోరాడినా ఆయన మాత్రం మంత్రి కాలేకపోయారు. ఆయనకు చీఫ్ విప్ ఇచ్చారు. రెండవ విడతలో అది కూడా తీసేశారు. ఆ అసంతృప్తి ఉంది. దానికి తోడు వైసీపీలో హై కమాండ్ పోకడలకు కూడా విసిగి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయానికి వచ్చారు అంటున్నారు. వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు.

వీరు కనుక అనుకున్నంత పని చేస్తే కనుక వైసీపీకి అది బిగ్ షాక్ అని అంటున్నారు. అంతే కాదు అది ఆయా ప్రాంతాల సామాజిక వర్గాల్లో వైసీపీ పట్ల ఏ మేరకు అసంతృప్తి ఉంది అన్నది కూడా కచ్చితంగా చెబుతూ ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు కలుగచేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News