ఏపీలో కీలక ప్రాజెక్టులపై లెక్కలు తేలాయ్..!
దీనిలోనూ కేంద్రం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉంది.
ఏపీలో కీలక ప్రాజెక్టుల వ్యవహారం లెక్క తేలిపోయింది. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆ రెండు ప్రాజె్క్టులను కూడా.. నిర్మించి తీరుతానంటూ.. చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులే సర్కారుకు గుది బండగా మారనున్నాయి. తాజాగా సర్కారు కూడా.. ఈ ప్రాజక్టుల విషయంపై అంతర్మథనం చెందుతోంది. ఆ రెండు ప్రాజెక్టులే.. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి.ఈ రెండు ప్రాజెక్టులు కూడా టీడీపీ కూటమి సర్కారుకు అత్యంత కీలకం. దీనిలోనూ కేంద్రం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉంది.
పోలవరం విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. 2014లో రాష్ట్ర విబజన సమయంలో దీనిని కేంద్రమే నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు నిర్ణయం చేసి.. విభజన చట్టంలోనూ నమోదు చేశారు. ఇక, ఆ సమయంలో 24 వేల కోట్ల రూపాయలు ఇస్తామని నిర్ణయించారు. కానీ.. పునరావాసం లెక్కలు జోడించకుండా.. మేం ప్రాజెక్టు కడుతున్నాం కాబట్టి.. మీరు పునరావా సం ఖర్చులు భరించాలన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తడిసి మోపెడైంది. దీంతో ఈ ఖర్చులు భరించలేక.. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దీనిని కేంద్రానికి ఇచ్చేసింది. ఈ క్రమంలోనే నవయుగ సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగించారు.
అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు కాంట్రాక్టు సంస్థను పక్కకు తప్పించి. రివర్స్ టెండర్ల పేరుతో 300 కోట్లు ఆదా చేస్తున్న ట్టు ప్రకటించింది. కానీ సకాలంలో పనులు ముందుకు సాగలేదు. కరోనా ఎఫెక్ట్‌తో రెండేళ్లు పనులు నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. దీంతో ఇది కాస్తా 42 కోట్లకు చేరింది. అప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు సకాలంలో రాలేదు. దీంతో ఇప్పుడు ఇది 60 వేల కోట్లకు దాదాపు చేరింది. ఇదే విషయాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది తనకు అర్ధం కావడం లేదన్నారు. దీంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది చర్చగా మారిపోయింది. పైగా వచ్చే ఐదేళ్ల వరకు కూడా పూర్తి కాదని అధికారులు కూడా తేల్చేశారు.
ఇక, అమరావతి రాజధాని విషయానికి వస్తే.. దీనికి కూడా వైసీపీ గ్రహణం కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. చంద్రబా బు ఈ ప్రాజెక్టును 2015లో ప్రారంభించారు. అప్పటి నుంచి కొనసాగించి ఉంటే.. గత జగన్ సర్కారులోనే నిర్మాణం పూర్తయిపో యి.. ఏపీకి నవ్య రాజధాని ఏర్పడి ఉండేది. కానీ, కుల, రాజకీయ ముసురులో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. అప్పట్లో 50 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ, తాజాగా ఈ ఖర్చు డబుల్ అయిపోయింది. ఇదే విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మొత్తంగా లక్ష కోట్ల వ్యయం అవుతుందని లెక్కతేల్చారు. సో.. ఇలా ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.