ఒంటరి అంకెలా వైసీపీ... కలసి కుమ్మేస్తున్నారే ?

వైసీపీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒకటి అంకె లాంటిదే.

Update: 2024-08-03 14:34 GMT

వైసీపీకి ఏపీలో సింగిల్ పొలిటికల్ లైఫ్ గానే సీన్ కనిపిస్తోంది. ఆ పార్టీ ఎవరితో దోస్తీ చేయదు, ఇక దోస్తీ చేసేందుకు కూడా ఎవరూ రారు. ఇది గత పన్నెండేళ్లుగా చూస్తున్న వ్యవహారమే. వైసీపీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒకటి అంకె లాంటిదే.

వైసీపీ అధినాయకత్వం కూడా సింగిల్ అని సింహం అని చెప్పుకుంటూ ఉంటుంది. మరి అదే ఆ పార్టీ ఫిలాసఫీగా మారిపోయింది. మిత్రులు ఉండడంలో తప్పు లేదు. రాజకీయంగా బలం ఉన్నా కూడా మిత్రులను కూడగట్టడమే గొప్పతనం. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి గత రెండు టెర్ములలోనూ పూర్తి మెజారిటీ వచ్చినా ఎక్కడా మిత్రులను పోనీయలేదు ఫలితంగా మూడవసారి మెజారిటీ రాకపోయినా ఎన్డీయే మిత్రులతో కలసి గట్టిగా నిలబడగలిగింది.

ఇక వాజ్ పేయి అయితే 1999 నుంచి 2004 మధ్యలో ఏకంగా పాతిక పై చిలుకు రాజకీయ పార్టీలతో కూటమి కట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. అది వాజ్ పేయి బలహీనత అని ఎవరూ అనలేదు. ఆయనకు అపారమైన బలంగానే చూశారు. రెండు పార్టీలనే కలిపి ఉంచలేని కూటమిలో ఏకంగా పాతిక పార్టీలతో రాజకీయంగా ముందుకు సాగడం అంటే అది వాజ్ పేయి లాంటి రాజకీయ విజ్ఞుడికే సాధ్యపడింది అని కూడా అంతా అనుకున్నారు.

చంద్రబాబుని కూడా అందరూ అనే మాట ఒకటే. ఆయన ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీని మారుస్తారు అని. అందులో తప్పు అయితే లేదు పైగా అలా మార్చి అన్ని పార్టీలతో సఖ్యతగా ఉండడం అంటే దానిని రాజకీయ చాణక్యంగా చూడాల్సి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. 2004లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నపుడు వామపక్షాలను బీఆర్ఎస్ లను కలుపుకుని మరీ ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం గా బలంగా ఉన్న బాబు మీద రాజకీయ సమరం సాగించారు. అలా బాబుని అధికారం నుంచి గద్దె దించారు కూడా.

అందువల్ల పొత్తులూ ఎత్తులూ అన్నవే రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి జగన్ రాజకీయం ఏమో తెలియదు కానీ ఎపుడూ ఏపీలోని రాజకీయ పార్టీలు ఆయనకు ప్రత్యర్ధులు గానే వ్యవహరిస్తున్నాయి. సీపీఐ అయితే ఈ నెల 4న వైసీపీ భూ కబ్జాల మీద మదనపల్లెలో అతి పెద్ద సదస్సుని నిర్వహిస్తోంది.

ఈ సదస్సులో వైసీపీ భూ కబ్జాల మీదనే సీపీఐ గట్టిగా విరుచుకుపడనుంది. అంతే కాదు రానున్న రోజుల్లో ఏపీలో భూ కబ్జాల మీద సీపీఐ నిరసనలు కూడా చేయనుంది. ఇదంతా వైసీపీ మీద పోరాటంగానే చూడాల్సి ఉంటుంది. నిజానికి అధికార కూటమికి వ్యతిరేకంగా కామ్రేడ్స్ ఉండాలి. ఏపీలో ఎన్డీయే కూటమి ఉంది. అంటే బీజేపీ ఉంది.

బీజేపీతో పడని వామపక్షాలు సహజంగానే జగన్ కి దగ్గర కావాలి. జగన్ సైతం వ్యూహాత్మకంగా వారి మద్దతు తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. వామపక్షాలు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి ప్రజా సమస్యల మీద చర్చిస్తున్నారు. గత ప్రభుత్వం భూ కబ్జాల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశంగానే చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎర్రన్నలు వైసీపీ మీదనే తమ పోరాటాన్ని ప్రస్తుతం సాగించేలా ఉన్నారు. ఇది అధికార కూటమికి ఎంతో మేలు చేసేలా ఉంది. అధికారంలో ఉన్న పార్టీ విపక్షం మీద కేసులు పెడితే కక్ష సాధింపు చర్యలు అని వైసీపీ దానిని చిత్రీకరించే ప్రమాదం ఉంది.

అలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్న మరో పార్టీయే గత ప్రభుత్వం మీద చర్యలకు డిమాండ్ చేసినపుడు జనంలోనూ అది చర్చగా వెళ్తుంది. దాంతో ఇక్కడ తప్పు జరిగింది ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటోంది అన్నదే జనంలోకి వెళ్తుందని, వైసీపీ ఒంటరిగా అవడమే కాకుండా ఇబ్బందుల్లో పడుతుందాని కూటమి పెద్దలు ఊహిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు రైటిస్ట్ పార్టీతో కూటమి కట్టారు. లెఫ్ట్ పార్టీలు కూడా సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నాయి. ఇక కాంగ్రెస్ సైతం ఏమీ అనడంలేదు. దాంతో వైసీపీని మీద తనదైన వ్యూహాలను అమలు చేయడానికి ఇదే తరుణమని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు