ఐటీ ఉద్యోగులకు చేదు కబురు చెప్పిన ఇక్రా!

యావత్ ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. దేశీయ పరిస్థితుల్ని.. దేశ ఆర్తిక పరిస్థితుల్ని మొత్తంగా మార్చేసిన రంగం ఐటీ అని చెప్పక తప్పదు

Update: 2023-08-30 03:52 GMT

రంగాలెన్ని ఉన్నా ఐటీ రంగానికి ఉన్న గ్లామర్.. గ్రామర్ లెక్కనే వేరు. నిజానికి ఐటీ రంగం ఎప్పుడైతే మాంచి ఊపులోకి వచ్చిందో.. ఆ రంగాన్ని నమ్ముకున్న భారతీయుల సుడి ఎంతలా తిరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ బూమ్ కు ముందున్న ఉద్యోగ అవకాశాలకు.. ఆ తర్వాత మారిన పరిస్థితుల్ని గడిచిన పాతికేళ్లుగా చూస్తున్నదే. యావత్ ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. దేశీయ పరిస్థితుల్ని.. దేశ ఆర్తిక పరిస్థితుల్ని మొత్తంగా మార్చేసిన రంగం ఐటీ అని చెప్పక తప్పదు. కరోనాలో అన్ని రంగాలకు భారీగా దెబ్బ పడితే.. ఐటీలో మాత్రం అందుకు భిన్నంగా కొంత మేర మాత్రమే ప్రభావితమైంది. ఆ మాటకు వస్తే.. కరోనా కష్టకాలంలో అన్ని పరిశ్రమలు ఐటీని నమ్ముకొని.. తమను తాము డిజటలైజ్ చేసే అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేసింది.

అనంతరం చోటు చేసుకున్న మాంద్యం పరిస్థితుల్లో ఆ రంగం కాస్తంత నెమ్మదించటం తెలిసిందే. మరి.. ఈ ఏడాది మాటేమిటి? అన్న విషయానికి వస్తే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు నెమ్మదిస్తుందన్న చేదు నిజాన్ని వెల్లడించింది దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 9.2 శాతం వృద్ధిని సాధిస్తే.. ఈ ఏడాది (2023-24) మాత్రం మూడు శాతానికే పరిమితం కావొచ్చన్న షాకింగ్ అంశాన్ని వెల్లడించింది.

లాభదాయకత దెబ్బ తిని.. నిర్వహణ లాభం ఒక శాతానికి తగ్గి 20-21 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. బ్యాంకింత్.. ఆర్థిక సేవలు.. బీమా.. రిటైల్ టెక్నాలజీ.. కమ్యునికేషన్ రంగాల్లో ఐటీ వ్యయాలు తగ్గుతుండటంతో ఐటీ కంపెనీలకు ఆదాయాలు తగ్గనున్నాయని ఇక్రా ఐటీ సెక్టార్ హెడ్ దీపక్ జోత్వానీ పేర్కొన్నారు. నాస్కామ్ లెక్కల ప్రకారం దేశంలో ఐటీ రంగంలో ప్రత్యక్షంగా పని చేస్తున్న వారి సంఖ్య 50 లక్షలుగా పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో వృద్ధిరేటు తగ్గుదల నమోదు కావటం.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (మొదటి మూడు నెలలు అంటే ఏప్రిల్ -జూన్) యూఎస్ డాలర్లలో 3.8 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది. గత పది త్రైమాసికాల్లో ఇదే అతి తక్కువ వృద్ధిగా చెబుతున్నారు. అయితే.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మాత్రం పరిస్థితుల్లో మార్పులు వస్తాయని.. అంతర్జాతీయ సవాళ్లు సద్దుమణిగితే ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఉద్యోగుల జీతాల పెంపు మీద ప్రభావం చూపనుంది.

Tags:    

Similar News