ట్రంప్ మోసం కేసులో కూతురు ఇవాంక కోర్టుకు ఏం చెప్పిందంటే?

ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టుకు హాజరైన ఆమె.. కంపెనీ తయారు చేసిన లెక్కల్ని తాను వ్యక్తిగతంగా చూడలేదన్నారు.

Update: 2023-11-09 04:04 GMT
ట్రంప్ మోసం కేసులో కూతురు ఇవాంక కోర్టుకు ఏం చెప్పిందంటే?
  • whatsapp icon

అగ్రరాజ్యం అమెరికాకు మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ పై దాఖలైన మోసం కేసు గురించి తెలిసిందే. దేశాధ్యక్షుడు కావటానికి ముందు తన కంపెనీల గురించి తప్పుడు వివరాలు ఇచ్చి భారీ ఎత్తున బ్యాంకులను బోల్తా కొట్టించిన ఆరోపణల కేసులు తాజాగా కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ట్రంప్.. ఆయన కుమారులు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ వంతు వచ్చింది.

ఎందుకంటే.. ఆమె ట్రంప్ కంపెనీలో కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారో.. ఆమె ట్రంప్ ప్రభుత్వంలో ట్రంప్ కార్యాలయంలో సీనియర్ సలహాదారుగా వ్యవహరించారు. ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టుకు హాజరైన ఆమె.. కంపెనీ తయారు చేసిన లెక్కల్ని తాను వ్యక్తిగతంగా చూడలేదన్నారు. వాటితో తనకు సంబంధం లేదన్న ఆమె.. ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఏ పత్రాల్ని తయారు చేశారో తనకు తెలీదన్నారు.

'ఆ పత్రాల్ని చూడలేదు. నేను వాటికి దూరంగానే ఉన్నా. ఆస్తుల గురించి పట్టించుకోలేదు. కంపెనీ తప్పుడు స్టేట్ మెంట్లు ఎవరు తయారు చేశారో నాకు తెలీదు. ఎలా తయారయ్యాయో తెలీదు' అంటూ వాంగ్మూలం ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశాధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక ఆయన ప్రభుత్వంలో ట్రంప్ కార్యాలయంలో సీనియర్ సలహాదారుగా వ్యవహరించిన ఇవాంకా.. అంతకు ముందు ట్రంప్ కంపెనీలో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా వ్యవహరించటం గమనార్హం.

ట్రంప్ కంపెనీని 2017లో ఆమె విడిచి పెట్టారు. తప్పుడు పత్రాలతో కంపెనీ తరఫున రుణం తీసుకోవటంలో ఇవాంకా ట్రంప్ సైతం కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వేళ.. ఆమె మాత్రం తనకు ఎలాంటి లెక్కలు తెలీవని.. వాటిని చూడలేదని పేర్కొనటం గమనార్హం. అయితే.. ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత ఇన్స్యూరెన్సుతో పాటు ఇంటి అద్దెను.. ఇతర ఖర్చులను.. సిబ్బంది వ్యయాన్ని.. చివరకు క్రెడిట్ కార్డు బిల్లుల్ని సైతం కంపెనీనే చెల్లించిందని అటార్నీ జనరల్ కార్యాలయం పేర్కొంది. చివరకు ఆమె లీగల్ ఫీజుల్ని సైతం కంపెనీనే భరించిందన్న అటార్నీ జనరల్ కార్యాలయం.. మోసం కేసులో ఆమె కీలక పాత్ర పోషించినట్లుగా పేర్కొంది. అయితే.. ఇవాంకా మాత్రం తనకు ఏ మాత్రం సంబంధం లేదని.. అసలు లెక్కల జోలికే వెళ్లలేదని పేర్కొనటంతో కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News