కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి.. వైరల్ వీడియో

కన్నీటి ధారను ఆపలేక చేతి రుమాలుతో తుడుచుకుంటూ భావోద్వేగపూరితంగా మౌనంగా నిలిచిపోయారు.

Update: 2025-03-01 13:18 GMT

రాజకీయాల్లో తన కఠిన వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై తిరుగులేని విమర్శలు చేసే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి ఓ ఘటనకు హృదయవిదారకంగా స్పందించి కంటతడి పెట్టారు. చిన్న పిల్లాడిలా ఉబికి ఉబికి ఏడ్చిన ఆయన భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో మీడియా ప్రతినిధులను పిలిచిన ఆయన, పచ్చని పొలాలు నీటి లేమితో ఎండిపోతున్న వైనాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. అయితే మాట్లాడే క్రమంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి ధారను ఆపలేక చేతి రుమాలుతో తుడుచుకుంటూ భావోద్వేగపూరితంగా మౌనంగా నిలిచిపోయారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో సాగు నీరు సక్రమంగా అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రైతుల గోసను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

రైతుల సమస్యలు తెలుసుకున్న జగదీష్ రెడ్డి ఈ ప్రాంతంలోని రైతులు సాగు నీటి సమస్యలను వివరిస్తూ, పంటలు ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో, రైతుల బాధను వ్యక్తిగతంగా అనుభూతి చెందిన జగదీష్ రెడ్డి కంటతడి పెట్టారు. రైతుల సమస్యలను సమీక్షించిన ఆయన, అధికారులతో వెంటనే మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ సమస్య తక్షణమే పరిష్కారం కావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల జీవితాలు నిలబెట్టే వ్యవసాయం సజావుగా సాగేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తాను వారికి అండగా ఉంటానని, అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

- తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక సాగునీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మించబడాయి. ఫలితంగా రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత పదేళ్ల పాటు కేసీఆర్ మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. కాలువలు ఉన్నా నీరు అందుబాటులో లేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో నీటి లేమితో నాశనమవుతున్న పంట పొలాలను చూసి కంటతడి పెట్టుకున్న జగదీశ్ రెడ్డి… తన బాధను ఆపుకోలేకపోయారని చెప్పాలి.

Tags:    

Similar News