ఆ ఇష్యూతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా ?
మరో వైపు జగన్ కోర్టుకు వెళ్ళడం పట్ల వైసీపీలోనూ చర్చ సాగుతోంది.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తన సొంత చెల్లెలు తల్లి మీద కోర్టుకు వెళ్ళడం పైన పలు రకాలుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇది టీడీపీకి ఆయుధంగా మారుతోంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు రాజకీయంగా కూడా ఇది జగన్ కి ఇరకాటంలో పెట్టే ఆస్కారం ఉందని అంటున్నారు.
మరో వైపు జగన్ కోర్టుకు వెళ్ళడం పట్ల వైసీపీలోనూ చర్చ సాగుతోంది. జగన్ ఇలా చేయడానికి చాలా సీరియస్ కారణాలే ఉన్నాయని అంటున్న వారూ ఉన్నారు. అదే సమయంలో జగన్ బెయిల్ మీద ఇపుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దానికి కారణం ఆయన లేటెస్ట్ గా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్. ఈ పిటిషన్ జగన్ ఎందుకు వేశారు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది.
ఎపుడో 2019 ఆగస్టులో జగన్ తనకు చెందిన సరస్వతి పవర్ కంపెనీలో కొన్ని షేర్లను తన సోదరి షర్మిలకు అలాగే తల్లి విజయమ్మ పేరున బదిలీ చేస్తూ జగన్ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారని అంటున్నారు.
అయితే ఇది జగన్ బెయిల్ కి సంబంధం ఉన్న ఇష్యూగా చెబుతున్నారు. జగన్ మీద 2012లో కేసులు పడ్డాయి. సీబీఐ జగన్ మీద కేసులు పెడితే ఎంటర్ అయిన ఈడీ జగన్ కి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. అలా అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో క్రయ విక్రయాలు కూడా బదలాయింపులు కానీ ఉండరాదు అని అంటారు.
అలా కనుక చేస్తే ఈడీ నిబంధనలను ఉల్లంఘించినట్లే అని అంటున్నారు. అయితే జగన్ ఎంఓయూల విషయంలో జాగ్రత్త పడ్డారు. ఈడీ దర్యాప్తు నుంచి బయటకు వచ్చాకనే వాటిని బదిలీ చేస్తామని పేర్కొన్నారు. కానీ జగన్ అలా ఇచ్చిన కొన్ని షేర్లు విజయమ్మ పేరు మీద ఉన్నవి షర్మిల పేరిట ఇటీవల బదిలీ అయ్యాయని ప్రచారం కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్నాయి.
దాని వల్లనే జగన్ ముందు జాగ్రత్తపడి తనకు ఈడీ వైపు నుంచి అలాగే బెయిల్ నిబంధనలను ఉల్లఘించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకే మొత్తం వ్యవహారాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఉంచి పిటిషన్ దాఖలు చేశారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
జగన్ బెయిల్ రద్దు చేసే కుట్ర ఇదని వారు ఆరోపిస్తున్నారు. అందుకే జగన్ పై ఎత్తు వేసి గత ఎంఓయూని రద్దు చేసుకుంటున్నట్లుగా ట్రిబ్యునల్ ముందు పెట్టారని చెబుతున్నారు. మరో వైపు చూస్తే సొంత తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మీద్ జగన్ కోర్టుకు వెళ్ళడంతో ఆయన ఇమేజ్ కి రాజకీయంగా ఇబ్బందులు వచ్చాయన్న కోణంలో కూడా చర్చ వైసీపీలో మొదలైంది.
దాంతో ఆ డ్యామేజ్ నుంచి బయటపడేందుకు వైసీపీ వెంటనే ఈ బెయిల్ కుట్ర ఉందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టింగులతో హల్ చల్ చేస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా వైఎస్సార్ కుటుంబం ఇపుడు నిట్టనిలువుగా చీలిపోయింది అన్నది బాహాటం అయింది అని అంటున్నారు.
ఇపుడు కొత్తగా మ్యాటర్ ఏంటి అంటే అన్నా చెల్లెలు వివాదం ఎలా ఉన్నా దివంగత నేత వైఎస్సార్ తల్లి అయిన విజయమ్మ మీద కూడా కోర్టుకు వెళ్ళారన్న దాని మీద చూస్తే కనుక వైసీపీకి అది కొంత ఇబ్బందిని కలిగించే విషయమే అని అంటున్నారు. అయితే జగన్ మీద ప్రత్యర్ధులు ఇపుడు అదను చూసి ఇబ్బందులు పెట్టేందుకు కాచుకుని ఉన్నారని అందులో తెలిసో తెలియకుండానే కుటుంబ సభ్యులు కూడా జత కలుస్తున్నారు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.
అయితే అదేమీ లేదని రాజకీయంగా తనకు ఎదురుగా ప్రత్యర్ధిగా ఉండడమే కాకుండా ఇటీవల ఎన్నికల్లో తన ఓటమికి ఒక కారణంగా తయారు అయిన వైఎస్ షర్మిల మీద ఆగ్రహంతో జగన్ చేసిన ఈ పని వల్ల విజయమ్మని సైతం ఇరికించారని అంటున్నారు. జగన్ విజయమ్మకు ఇచ్చిన షేర్లను ఆమె కూతురుకు బదిలీ చేయడంతోనే ఈ మొత్తం వ్యవహారం వేరే మలుపు తిరిగిందని కూడా అంటున్నారు. మరి ఈ రకమైన ప్రచారంలో అసలు వాస్తవాలు ఏమిటో చూడాల్సి ఉంది.