మాటల్లేవ్.. చేతలే.. అందుకేనా అసెంబ్లీకి జగన్!
ఇక, ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్న దరిమిలా.. ఆయన ఎన్నిరోజులు వస్తారు? ఏం చేస్తా రు? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి సోమవారం(ఫిబ్రవరి 24) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నా యి. తొలిరోజు మండలి, శాసన సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ సమావేశాలకు మాత్రమే జగన్ అండ్ కో హాజరుకానున్నారు. కానీ, ఆ తర్వాత.. రోజుల సంగతేంటి? అనేది మాత్రం వైసీపీ వెల్లడించలేదు. దీనిని బట్టి తొలిరోజు వెళ్లినా.. మాటలు ఉండవు. ఇక, ఉండేదల్లా.. మౌనంగా కూర్చుని గవర్నర్ ప్రసంగాన్ని వినడమే.
అయితే.. ఇలా మౌనంగా కూర్చుని, గవర్నర్ ప్రసంగాన్ని వినేందుకే జగన్ ఆయన ఎమ్మెల్యేలు వస్తున్నారా? అంటే.. డౌటే! ఎందుకంటే.. గతంలోనూ కూటమి హయాంలో జరిగిన మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు వచ్చిన జగన్ ఆయన ఎమ్మెల్యేలు.. రచ్చ చేశారు. అప్పట్లో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. నల్లబ్యాడ్జీలు ధరించి.. నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మందీమార్బలంతో వచ్చిన జగన్.. సుమారు రెండు కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేశారు. అనంతరం.. అసెంబ్లీ వద్ద.. ఓ పోలీసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''మధుసూదన్‌రావ్.. గుర్తుపెట్టుకుంటా!'' అని జగన్ అన్న మాటలు అప్పట్లో వివాదానికి దారితీశాయి.
ఇక, ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. అదేసమయంలో సూపర్ సిక్స్ అమలు చేయడం లేదన్న వాదన కూడా విపక్షం వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వచ్చి.. రచ్చ చేసి.. వెళ్లిపోవాలన్నదే ప్లానా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. గతంలోనూ.. గవర్నర్ ప్రసంగం కాయితాలను చింపేసి అక్కడే పడే మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు.
సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇదిలావుంటే.. జగన్ సభలకు రాడు అన్న అపవాదును తొలగించుకోవడం.. తన సభ్యత్వాన్ని, తన పార్టీ నేతల సభ్యత్వాన్ని కూడా కాపాడుకునేందుకు ఒక్క రోజైనా అటెండ్ అయితే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.