ఆ విషయంలో జగన్ కు ఇంకా అదే నమ్మకం!
అయినప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంకా అదే నమ్మకంతో ఉన్నారు.
ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే చాపచుట్టేసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత స్థాయికి పడిపోయింది.
అయినప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంకా అదే నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన అబద్ధపు మోసాలను ప్రజలు నమ్మారని.. లేదంటే తానే గెలిచేవాడినని నమ్ముతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. తాను ముఖ్యమంత్రి అవుతానని జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని ఏ సాకులు చెప్పకుండా అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. మరోవైపు
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సీఎం చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ మండిపడ్డారు.
బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్‌కు ఎంత ఇస్తున్నారు, ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుందన్నారు. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తామో తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని జగన్ గుర్తు చేశారు. ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా వెల్లడించామన్నారు. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అండగా నిలిచామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారని జగన్ తెలిపారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోందన్నారు.
చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయన్నారు. చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు.
జగన్ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు బిర్యానీ లేదు సరికదా.. ఉన్న పలావు కూడా పోయిందన్నారు. సూపర్ సిక్సూ లేదు సూపర్ సెవెనూ కూడా లేవని ఎద్దేవా చేశారు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయని తెలిపారు. టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయిందని చెప్పారు. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఆరోగ్యశ్రీ సైతం అటకెక్కిందని తెలిపారు. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందని ఆరోపించారు.
మొత్తానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని జగన్ గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది. ఈ ఆగ్రహం వచ్చే ఎన్నికల నాటికి మరింత ప్రజ్వరిల్లి కూటమి పార్టీలను ఎన్నికల్లో ఓడిస్తారని.. మరోసారి తనకు ఘనవిజయాన్ని కట్టబెడతారని గట్టిగా విశ్వసిస్తున్నారు.