పోసాని అరెస్ట్‌పై జగన్ సంచలన కామెంట్స్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు.;

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థులను పథకం ప్రకారం జైలులో పెట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో నంది అవార్డుల విషయంలో పోసాని చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆయనపై 18 కేసులు పెట్టి నెల రోజులకు పైగా జైలులో ఉంచారని జగన్ విమర్శించారు. ఈ చర్యలకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజలు, పోలీసులు కలిసి నేరాలు చేస్తున్నారని, లింగమయ్య ఘటన ఇందుకు నిదర్శనమని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణను కూడా కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని, నందిగం సురేష్‌ను తప్పుడు కేసులతో 145 రోజులు జైలులో ఉంచారని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలని జగన్ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజలు సూపర్ సిక్స్ హామీలపై ప్రశ్నిస్తున్నారని, చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
కొందరు పోలీసులు చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్‌మెన్‌లా పనిచేస్తున్న పోలీసులకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం" అని జగన్ హెచ్చరించారు.
పోలీసులు చంద్రబాబుకు వాచ్‌మెన్‌ల లాగా ప్రవర్తిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక వారి ఉద్యోగాలు పీకేసి, బట్టలు ఊడదీసి కొడతామని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. 57 చోట్ల ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబుకు అనుకూలమైన వాతావరణం లేదని పోస్ట్ పోన్ చేశారని జగన్ ఆరోపించారు. మిగిలిన 50 చోట్ల వైసీపీ ఏకంగా 39 చోట్ల గెలిచిందని ఆయన తెలిపారు. ఈ ఫలితాలే చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని జగన్ అన్నారు.