కూటమి ఓటమి... జగన్ లాజిక్ వర్కౌట్ అవుతుందా ?
2029లో ఎన్నికలు జరిగినా లేదా అంతకు ముందే జమిలి పేరుతో ఎన్నికలు జరిగినా కూటమికి పరాజయం తప్పదని కూడా ఆయన భావిస్తున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న ఎనిమిది నెలల టీడీపీ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక కచ్చితమైన అంచనాకు వచ్చేశారు. ఈ ప్రభుత్వం ఓటమి పాలు అవుతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. 2029లో ఎన్నికలు జరిగినా లేదా అంతకు ముందే జమిలి పేరుతో ఎన్నికలు జరిగినా కూటమికి పరాజయం తప్పదని కూడా ఆయన భావిస్తున్నారు.
అదే మాటను ఆయన పార్టీ నేతలతో నిర్వహించే సమావేశంలో చెబుతూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కూటమి ఓటమి తధ్యమని అంతే కాదు జగన్ 2.0 పాలన స్టార్ట్ అయి ఏకంగా ముప్పయ్యేళ్ళ పాటు సాగుతుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దానికి ఆయన లాజిక్ తో కూడిన కారణాలకు చెబుతున్నారు. అదేంటి అంటే తాను అయిదేళ్ల పాటు ఎన్నికల మేనిఫేస్టోని పవిత్రంగా భావించి హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తేనే జనాలు ఓడించారని జగన్ అంటున్నారు. తాను అదే పనిగా బటన్ల మీద బటన్లు నొక్కడం చేసినా జనాలు తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.
మరి ఏ ఒక్క హామీని తీర్చని ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో అని ఆయన తర్కానికి అందేలాగానే డౌట్ వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని ఎవరికీ ఏ ఒక్క పధకం దక్కలేదని అందుకే కచ్చితంగా జనాలు ఓడించి తీరుతారని జగన్ భావిస్తున్నారు.
అయితే జగన్ చూసింది కూటమి పాలనలో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. ఇంకా వారి చేతిలో నాలుగేళ్ల నాలుగు నెలల పాలన ఉంది. మరి ఈ కాలంలో కూటమి ఈ హామీలను నెరవేరిస్తే అపుడు జనాలు కూటమి వైపే ఉండే అవకాశాలు ఉంటాయి కదా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే అయిదేళ్ళు సీఎం గా పనిచేసిన జగన్ కి దీని మీద కూడా ఒక లెక్క ఉంది అని అంటున్నారు.
తాను ఇచ్చిన హామీల అమలుకే ఏటా డెబ్బై అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని రెట్టింపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని హామీలు తుచ తప్పకుండా అమలు చేయాలీ అంటే లక్షన్నర కోట్లు ఉండాలని అంచనా వేస్తున్నారు అని చెబుతున్నారు. ఇక ఈ హామీలలో కొన్ని చేసినా అవి కూడా లబ్దిదారులలో కోత పెట్టి చేసినా కండిషన్లు పెట్టినా వారు అసంతృప్తి చెందుతారని అపుడు వారే ప్రభుత్వాన్ని ఓడిస్తారు అన్నది ఆయన అంచనాగా ఉంది అంటున్నారు.
మరి జగన్ మార్క్ లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు పెరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు ఎందుకు అధికారంలోకి వచ్చామో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. దోచుకో పంచుకో దాచుకో అన్నదే కూటమి ప్రభుత్వం విధానం అని విమర్శిస్తున్నారు. నియోజకవర్గాలలో ప్రతీ పనీకి ఇంత చెల్లించాలి అని దందాను స్టార్ట్ చేశారని దాని వల్ల ఇబ్బందులు ప్రజలు పడుతున్నారని జగన్ అంటున్నారు
ఇక తాను ఓటమి చెందడానికి ఇన్నాళ్ళూ ఈవీఎంలను నిందించిన జగన్ ఇపుడు ఇంకో మాట చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం అలవి కానీ హామీలను ఇవ్వకపోవడం వల్లనే తాను ఓటమి పాలు అయ్యాను అని ఆయన అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని అంటున్నారు. మరి జగన్ అంచనాలు కూటమి ప్రభుత్వం పనితీరు మీద ఆయన ఇస్తున్న రివ్యూస్ అన్నీ కరెక్ట్ గానే ఉంటున్నాయా అన్నది చూడాలి. జనాలు ఏమి ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తోంది అన్నది ఒక చర్చగానే ఎపుడూ ఉంటుంది.
ప్రభుత్వం తమ ప్రాధాన్యతలను ముందు పెట్టి పాలన చేస్తుంది. జనాలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. వీటి మధ్య బాలెన్స్ సాధిస్తే కనుక ప్రభుత్వానికి మంచి మార్కులే పడతాయి. మరి కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఉన్న ఆలోచనలు చర్చలు రాజకీయంగా విశేష అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియవా ఆయన ఎప్పటికపుడు సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కదా అన్న మాట ఉంది.
అదే సమయంలో ప్రభుత్వం కూడా అలెర్ట్ అవుతుంది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా కూటమికి ఓటమి అని జగన్ అంటూంటే మళ్ళీ మళ్ళీ మా పాలనే అని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. అయితే ఇపుడు నడుస్తోంది 2025 సంవత్సరం. ఇంకా నాలుగేళ్ళకు పైగా ఎన్నికలకు సమయం ఉంది. అందువల్ల ఎవరి అంచనాలు లెక్కలు కరెక్ట్ అన్నది ఇపుడే చెప్పడం టూ ఎర్లీ అన్నది ఒక విశ్లేషణగా ఉంది.