కారణం ఏదైనా.. విజయం రఘురామదే..!!
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభకు రానని తెగేసి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం మార్చుకోడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు మనసు మార్చుకుని సభకు రావాలనుకోవడం ఇంట్రస్టింగుగా మారింది. ప్రభుత్వం అధికారికంగా గుర్తించినా, గుర్తించకపోయినా రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ప్రతిపక్షం. కాంగ్రెస్, వామపక్షాలు వంటివి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా, వాటి ఉనికి పరిమితం. దీంతో ప్రతిపక్ష బాధ్యత పూర్తిగా వైసీపీపైనే ఉంది. కానీ, తనకు హోదా ఇవ్వని పక్షంలో అసెంబ్లీలో అడుగు పెట్టనని జగన్ గతంలో ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. అయితే ఇప్పుడు ఏం కారణం చేతో ఆయన మనసు మార్చుకున్నారు. అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి రావాలనే నిర్ణయం వెనుక డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పాత్ర ఉందని అధికార కూటమి ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు విజయం సాధించారని చెబుతోంది.
ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభకు రానని తెగేసి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం మార్చుకోడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా తాను ప్రభుత్వంపై ఎంతలా పోరాడినా ప్రజలకు సరైన విధంగా చేరడం లేదని ఆయనకు సమాచారం ఉందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. దీనికి తగ్గట్టే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, డబ్బు సమకూరే వరకు సంక్షేమ పథకాలను అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. అయితే దీనిపై మీడియా ముఖంగానే విమర్శలు చేయడం వల్ల ఉపయెగం ఉండటం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్షంగా నిలదీస్తే.. అధికార పక్షం కచ్చితంగా సమాధాన చెప్పాల్సి ఉంటుందని పార్టీలో నేతలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. సమయం ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ఒక్క ప్రశ్నతోనైనా తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లవచ్చని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు అంతా సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే జగన్ సభకు వెళ్లాలనే నిర్ణయం వెనుక మరో బలమైన కారణం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు హెచ్చరికలు వైసీపీ ఎమ్మెల్యేలను భయపెట్టాయని అంటున్నారు. వరుసగా 60 రోజులు శాసనసభకు గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వం అటోమెటిక్ గా రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ గతంలో చెప్పారు. ఆయన చెప్పిన మాటలు నిజమేనంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ధ్రువీకరించారు. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న మొత్తం 11 చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. దీంతో డిప్యూటీ స్పీకర్ అన్నంత పనీ చేస్తే.. అనివార్యంగా వచ్చే ఉప ఎన్నికలలో ప్రజలకు ఏమని సమాధానం చెబుతామని వైసీపీ ఎమ్మెల్యేలు డైలమాలో పడిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. సభకు రాకుండా అనర్హత వేటు వేయించుకుని, మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవడం అంటే అంత చిన్నవిషయం కాదని, అందుకే వైసీపీ తన వైఖరి మార్చుకుందని టీడీపీ విశ్లేషిస్తోంది.
ఇలా రెండు పార్టీలు వేటికి అవి తమ వాదన వినిపిస్తున్నా.. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుదే పైచేయిగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. శాసనసభ నిబంధనలు ఉన్నాయో లేవో కానీ, ఆయన హెచ్చరికల తర్వాత వైసీపీ వైఖరిలో మార్పు రావడం రఘురామ విజయంగానే చూడాలని అంటున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్న వైసీపీ.. కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తుందా? లేక సభ జరిగిన అన్ని రోజులూ హాజరవుతుందా? అన్నది క్లారిటీ లేదు. దీంతో వైసీపీ వైఖరి ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉందని అంటున్నారు.